Southern Section: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణం నిర్మాణానికి కేంద్రం ఓకే!
ABN, Publish Date - Jan 12 , 2025 | 03:47 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం పనులను కూడా కేంద్రమే చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఆమోదం
పెరిగిన దూరం.. గతంలో 189 కి.మీ
ప్రస్తుతం 200 కిలోమీటర్లకు చేరిక
డీపీఆర్ కోసం మళ్లీ టెండర్ల పిలుపు
ఫిబ్రవరి 9వ తేదీ వరకు గడువు
దక్షిణభాగం కేంద్రం చేపడుతుందని గతంలోనే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం పనులను కూడా కేంద్రమే చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగాన్ని కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్మిస్తున్న నేపథ్యంలో దానికి సమాంతరంగా దక్షిణభాగాన్ని కూడా నిర్మించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. రహదారికి అవసరమైన భూ సేకరణతోపాటు, సేకరించిన భూములకు చెల్లించే పరిహారంలో రాష్ట్రం వాటాగా 50 శాతం ఇస్తామని తెలిపింది. రహదారి మార్గాన్ని ఖరారు చేసే అలైన్‌మెంట్‌కు, భూసేకరణకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగాన్ని నిర్మించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ (డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీల ఎంపిక కోసం గతేడాది నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
డిసెంబర్ 16 వరకు గడవు విధించి, 17న టెండర్ బిడ్‌లను తెరుస్తామని ప్రకటించింది. వివిధ కారణాలతో చివరితేదీ వరకు ఒక్క టెండరూ రాలేదు. దీంతో ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచి జనవరి 20 వరకు గడువునిచ్చింది. కానీ, ఈలోపే మళ్లీ ఆ టెండర్లను కూడా రద్దు చేసి.. టెండర్ల నోటిఫికేషన్‌లో పలు మార్పులు చేర్పులు చేసింది. ఫిబ్రవరి 9వ తేదీవరకు టెండర్లను వేసేందుకు అవకాశం కల్పించింది. 10న బిడ్‌లను తెరవనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగాన్ని నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలోనే.. డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు, అందులో పలు మార్పులను చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్టు తాజాగా తెలిసింది. ఈ తాజా టెండర్‌ను ఈసారి రాష్ట్ర పరిధిలోని ‘ఈ-ప్రొక్యూర్ మెంట్’ సైట్‌లో కాకుండా ‘గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్- సెంట్రల్ పబ్లిక్ పోర్టల్’లో అప్‌లోడ్ చేయటం విశేషం. కాగా గతంలో ఈ రహదారి మంజూరైనప్పుడు ప్రాథమికంగా ఖరారైన అలైన్‌మెంట్ ప్రకారం చౌటుప్పల్- ఆమనగల్- సంగారెడ్డి వరకు 189 కి.మీ.ల రోడ్డు ఉండగా.. ప్రస్తుతం దూరం 11 కి.మీ.లు పెరిగింది. తాజాగా ఆహ్వానించిన టెండరు నోటీసులో 200 కి.మీ.ల రహదారికి డీపీఆర్ ఇవ్వాలని పేర్కొన్నారు.
ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం పనులు కేంద్రం చేతికి వెళ్లే అవకాశం ఉందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. 2024 డిసెంబరు 31న ‘ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగమూ.. కేంద్రం చేతికే!’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. తాజా పరిణామాలు ఇది నిజమని నిరూపిస్తున్నాయి. కాగా, డీపీఆర్‌ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లను ఆహ్వానించినప్పటికీ.. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్, సూపర్‌విజన్ బాధ్యతలను కేంద్రానికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. కాగా రహదారి మార్గం (అలైన్ మెంట్) దగ్గరి నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలు డీపీఆర్ ద్వారా స్పష్టమవుతాయి.
మార్గమధ్యంలో వెహి కల్ అండర్ పాస్‌లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్ జంక్షన్‌లను ఎన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? రహదారి వెళ్లే మార్గంలో గ్రామాలు, ఆవాసాలున్నాయా? చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి? సాగు చేసుకుంటున్న భూములు.. అటవీభూములు ఎన్ని ఉన్నాయి? వంటి సమగ్ర వివరాలను సేకరిస్తారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరిగే వాహనాల లెక్క తేలితే.. రాబోయే 15-18 ఏళ్లలో వాటి వృద్ధి ఎలా ఉంటుంది, దాని ప్రకారం టోల్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందనే దానిపైనా స్పష్టత వస్తుంది. దాని ప్రకారమే రహదారిని ఏ విధానంలో నిర్మించాలనేదానిపై ఒక అంచనా వస్తుంది.
Updated Date - Jan 12 , 2025 | 03:47 AM