Rythu Bharosa: రైతు భరోసా 12 వేలు
ABN, Publish Date - Jan 05 , 2025 | 03:15 AM
Rythu Bharosa: రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ఎకరానికి సీజన్‌కు రూ.6 వేల చొప్పున చెల్లింపు
సాగు యోగ్యమైన భూములన్నింటికీ వర్తింపు
భూమి లేని రైతు కుటుంబాలకు ఏటా 12 వేలు
‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’గా పథకం
రేషన్ కార్డులు లేనివారికి నూతన కార్డులు
ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి
వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వం
గతంలో ‘ధరణి’ వల్ల కొన్ని భూములకు అందింది
రెవెన్యూ సిబ్బంది గ్రామాలవారీ వివరాల సేకరణ
క్యాబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం
గతంలోకి వెళితే కేసీఆర్ కుటుంబానికి.. వయ్యేళ్ల జైలుశిక్ష అంటూ విమర్శ
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీంతోపాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు లేనివారందరికీ నూతన రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ మూడు పథకాలను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని క్యాబినెట్ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన దాదాపు మూడు గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది.
అనంతరం క్యాబినెట్ భేటీ వివరాలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. సీఎం మాట్లాడుతూ, ‘‘తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లోభాగంగా ‘రైతు భరోసా’ ఒకటి. దీనిపై ఎవరికి వారే ఊహించుకుని రకరకాల సమాచారంతో రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని నిర్ణయించాం. ‘రైతు భరోసా’ పథకం కింద వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సాయం అందజేస్తాం. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా రూ.10 వేలు ఇస్తే.. మా ప్రభుత్వ ప్రజా పాలనలో ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది’’ అని సీఎం రేవంత్ వివరించారు.
భూమి లేనివారికి ఏడాదికి రూ.12 వేలు
తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుని జీవించే భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’గా నామకరణం చేసినట్లు చెప్పారు. రేషన్ కార్డులు లేనివారందరికీ నూతన కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకాలన్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
అలాంటి భూములకు రైతుభరోసా ఇవ్వం
వ్యవసాయ యోగ్యంకాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాళ్లు, రప్పలు, గుట్టలు ఉన్న భూములు, రోడ్లు, మైనింగ్ కింద పోయిన భూములకు, నాలా కన్వర్షన్ కింద రియల్ ఎస్టేట్‌గా మారిన భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసాను వర్తింపజేయం. ఇందులో ఎలాంటి గందరగోళ ఉండాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాలవారీగా సమాచారాన్ని సేకరించి, గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారు. పరిశ్రమలుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన, ప్రభుత్వం సేకరించిన భూములకు ఇకపై రైతు భరోసా ఇవ్వడం జరగదు. గతంలో ధరణి లోపాల వల్ల ఇలాంటి కొన్ని భూములకు కూడా రైతుబంధు సొమ్ము అందింది. ఇలాంటి భూముల విషయంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా సహకరించాలని కోరుతున్నాను. ఇప్పటి ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని గతంలో రైతుబంధు కింద ఇచ్చిన రూ.10 వేల నుంచి మా రైతు భరోసా కింద రూ.12 వేలకు పెంచాం.
అదే విధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడం అనే భావనతో.. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతో రైతులకు మేలు చేయాలన్నదే మా ఆలోచన. ఈ పథకాలను జనవరి 26 నుంచి అమలు చేయాల్సి ఉన్నందున.. ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళ్లి చూస్తే... కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాల జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుంది. వాటికంటే భవిష్యత్తులో నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ విధానం. వ్యవసాయ యోగ్యమైన ప్రతిఎకరాకు రైతుభరోసా వస్తుంది’’అని అన్నారు.
‘పాలమూరు-రంగారెడ్డి’కి జైపాల్‌రెడ్డి పేరు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాకుండా జూరాల నుంచి కృష్ణా జలాలను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించడానికి వీలుగా కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది, ఎక్కడి నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి.. అనే విషయాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు కాలువకు మాజీ మంత్రి సిలారపు రాజనర్సింహ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరి ఉపనది అయిన మంజీరాపై 30 టీఎంసీల సామర్థ్యంతో 1979లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా.. 1989లో నిర్మాణం పూర్తయింది.
కారుణ్య నియామకాలకు మోక్షం..
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర క్యాబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ శాఖలో పనిచేస్తూ అనారోగ్యం, ఇతర కారణాలతో 588 మంది సిబ్బంది మరణించగా.. వారి కుటుంబ సభ్యులకు ఆ ఉద్యోగాలు కల్పించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు మంత్రి సీతక్క ఎంతో కృషి చేశారంటూ కారుణ్య నియామకం పొందే అభ్యర్థులు ఆమెకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ములుగు జిల్లా కేంద్రాన్ని మునిసి పాలిటీగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీగా ఉన్న ములుగును మునిసిపాలిటీగా మారుస్తూ 2022లోనే అసెంబ్లీ తీర్మానం చేసినా.. బిల్లులో పలు లోపాలు ఉండడంతో నాటి గవర్నర్ ఆమోదించలేదు. ప్రస్తుత మంత్రివర్గం ఆ బిల్లును రీకాల్ చేసి ఆమోదం తెలపడంతో ములుగు మునిసిపాలిటీగా అవతరించేందుకు మార్గం సుగమమైంది. దీంతోపాటు ప్రస్తుతం మునిసిపాలిటీగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణాన్ని మునిసిపల్ కార్పొరేషన్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు.
నార్లాపూర్ రిజర్వాయర్ అంచనాల సవరణకు ఆమోదం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన 6.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నార్లాపూర్ రిజర్వాయర్ సవరణ అంచనాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలుత రూ.884 కోట్లతో దీన్ని చేపట్టగా.. ఆ తర్వాత రూ.1448 కోట్లకు సవరించారు. తాజాగా రూ.1784 కోట్ల సవరణ అంచనాలకు ఆమోదముద్ర వేశారు. ఇదే పథకంలోని ప్యాకేజీ-3 నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని తీసుకెళ్లే ఓపెన్ కెనాల్ సవరణ ప్రతిపాదనలు నిబంధనల ప్రకారం లేని క్రమంలో.. మంత్రివర్గం వాటిని తిరస్కరించింది. మరోవైపు డిండి ఎత్తిపోతల పథకంలో రూ.1788.89 కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచే నీటిని తరలించే(ఏదుల-డిండి) అలైన్‌మెంట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో ఏదుల నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించనున్నారు.
Updated Date - Jan 05 , 2025 | 07:17 AM