CM Revanth Reddy: రాజీ పడం.. మోదీతో కొట్లాడతాం!
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:16 AM
తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోదీతో కొట్లాడాల్సి వస్తే.. కొట్లాడతానని, అసదుద్దీన్‌తో కలిసి పనిచేయాల్సి వస్తే.. కలిసికట్టుగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి మజ్లిస్‌తో కలిసి నడుస్తాం
అతిపెద్ద వంతెనల నిర్మాణం కాంగ్రెస్ సర్కారులోనే
అక్బరుద్దీన్, నేను చిన్ననాటి స్నేహితులం.. కలిసి తిరిగాం
జూపార్కు- ఆరాంఘర్ వంతెన ప్రారంభోత్సవంలో రేవంత్
పాతబస్తీలో ప్రతి గల్లీ తెలుసు..
హైదరాబాద్ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోదీతో కొట్లాడాల్సి వస్తే.. కొట్లాడతానని, అసదుద్దీన్‌తో కలిసి పనిచేయాల్సి వస్తే.. కలిసికట్టుగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని, తాను కాంగ్రెస్ సీఎంను అని అనుకుంటే రాష్ట్రానికి కావాల్సిన పనులు జరగవన్నారు. రాష్ట్రానికి వాటాగా దక్కాల్సిన నిధులు సాధించుకోవాలని, పనులు చేయించుకోవాలని, అందుకే తాను అందరినీ కలుస్తానని ప్రకటించారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని స్పష్టం చేశారు. సోమవారం జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు రూ.799 కోట్లతో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చర్లపల్లి టర్మినల్ అభివృద్ధి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించానని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆస్తుల సేకరణ, ఇతరత్రా సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని టర్మినల్ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ‘‘చర్లపల్లి టర్మినల్ వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో మాట్లాడాను. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొదలైందని, తెలంగాణ ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు గత ప్రభుత్వం ప్రాజెక్టు విస్తరణకు ప్రయత్నించలేదని చెప్పాను. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదించి విస్తరణకు అనుమతినివ్వాలని, అవసరమైన నిధులూ కేటాయించాలని కోరాను’’ అని రేవంత్ వివరించారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు..
మూసీ పునురుజ్జీవం ప్రాజెక్టు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని సీఎం రేవంత్ తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట రీజనల్ రింగ్ రైల్ నిర్మాణానికీ సహకరించాల్సిందిగా కోరానన్నారు. ఇవన్నీ జరిగితే ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా కలిపినా.. తెలంగాణ అభివృద్ధితో పోలిస్తే తక్కువే అవుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, తెలంగాణ ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్, ఎంఐఎం అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాయని ఉద్ఘాటించారు. రాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక నగరంలో అతి పొడవైన పీవీఎన్‌ఆర్ వంతెనను వైఎ్‌సఆర్ హయాంలో అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇప్పుడు నాలుగు కిలోమీటర్ల రెండో పెద్ద వంతెనను ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. రహదారుల విస్తరణ, మెట్రో నిర్మాణం, వంతెనలు, ఎస్‌టీపీలు, మీరాలం చెరువుపై కేబుల్ వంతెన నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని, పనులు చేసే బాధ్యత ఇక్కడి ప్రజాప్రతినిధులదేనని అన్నారు. 1908లో వరదలు వచ్చినప్పుడు.. మూసీ, ఈసా నదులు నిర్మించి నగరంలో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదుల, తాగునీటి సౌకర్యం కల్పించారని, చెరువులు, తోటలతో గతంలో చేసిన అభివృద్ధిని కాపాడుకొని ఉంటే.. ప్రపంచంలో హైదరాబాద్‌తో పోటీ పడే నగరమే ఉండేది కాదన్నారు.
ప్రతి గల్లీ తెలుసు..
‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. నగరాభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై 11 లేదా 12న ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సచివాలయంలో సమావేశం నిర్వహిస్తాం.’’ సీఎం రేవంత్ తెలిపారు. వారంలో గోషామహల్ మైదానంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం దుర్గం చెరువుపై కేబుల్ వంతెన చూసేందుకు వెళ్తున్నారని, రెండేళ్లలో మీర్ ఆలం ట్యాంక్‌పై కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వస్తారని అన్నారు. ‘‘సంతో్‌షనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా మా ఊరికి వెళ్తుంటా. ఇక్కడి గల్లీ గల్లీ నాకు తెలుసు. పాతబస్తీ అభివృద్ధి కోసం చేపడుతున్న చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, మెట్రో, రోడ్ల విస్తరణకు అవసరమైన నిధులు కేటాయిస్తాం. బడే భాయ్, చోటా భాయ్.. ఇద్దరూ పెద్ద జాబితాను నా ముందుంచారు. వాటన్నింటినీ మా శ్రీధర్‌బాబు రాసుకున్నారు. సాధ్యమైనంత మేర పనులు చేసేందుకు కృషి చేస్తాం’’ అని సీఎం చెప్పారు. అక్బరుద్దీన్, తాను చిన్ననాటి స్నేహితులమని, ఉర్దూ గల్లీలో ఇద్దరం కలిసి తిరిగే వాళ్లమన్నారు. ఎంఐఎం ప్రతిపక్ష నేత అవుతానని అక్బర్, సీఎంను అవుతానని తాను అనుకోలేదని రేవంత్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
వంతెనకు మన్మోహన్ పేరు..
జూపార్కు- ఆరాంఘర్ వంతెనకు దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా, పదేళ్లు ప్రధానమంత్రిగా దేశ కీర్తిప్రతిష్టలు ప్రపంచానికి చాటిన మహానీయుడి సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.