Share News

Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:08 AM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఆ పార్టీ అధిష్ఠానం వద్ద మరోమారు కదలిక వచ్చింది.

Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

  • వారం పది రోజుల్లో కొలిక్కి వచ్చే చాన్స్‌

  • లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే!

  • బెర్తులపై హైకమాండ్‌ తర్జన భర్జన

  • సీఎం, పీసీసీ చీఫ్‌ అభిప్రాయాల సేకరణ

  • ప్రస్తుతం నలుగురితో విస్తరించే యోచన

  • తెరపైకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు

  • వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు చోటు!

  • టీపీసీసీకి తొలుత వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధుల నియామకం

  • ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకానికి మరికొంత సమయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఆ పార్టీ అధిష్ఠానం వద్ద మరోమారు కదలిక వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణగోపాల్‌తో జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంతోపాటు మంత్రివర్గ విస్తరణపైనా చర్చించారు. ఈ రెండు అంశాలపై నలుగురి అభిప్రాయాలనూ కేసీ వేణుగోపాల్‌ తీసుకున్నారు. వారి అభిప్రాయాలు, అధిష్ఠానం సేకరించిన ఇతరత్రా సమాచారం, సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల వారీ ప్రాతినిధ్యం తదితరాలను పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ దఫా విస్తరణలో నలుగురికే చాన్స్‌ ఉండవచ్చని అంటున్నారు. మరో వారం పది రోజుల్లో ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, రాని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అధిష్ఠానం వద్ద జరిగిన సమీక్షలో మాదిగ (ఉపకులం) కోటా కింద స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించారు. మాల సామాజికవర్గం నుంచి గడ్డం వివేక్‌ వెంకటస్వామి పేరుపై చర్చ జరిగింది. రెడ్డి సామాజికవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెలమ సామాజికవర్గం నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరి, లంబాడా వర్గం నుంచి బాలునాయక్‌ పేర్లపై ప్రధానంగా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుస్తోంది.


వాకిటి శ్రీహరికి బెర్తు ఖాయం!

లోక్‌సభ ఎన్నికల సమయంలో ముదిరాజ్‌ సామాజికవర్గ నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్తు ఖరారైనట్లేనని చెబుతున్నారు. మాదిగ వర్గం నుంచి కడియం శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నా.. ఆయనపై ప్రస్తుతం అనర్హత కత్తి వేలాడుతోంది. ఈ నెల 18న సుప్రీంకోర్టు స్పందనను బట్టి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇక వివేక్‌ కుటుంబానికి ఇప్పటికే ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఉండడం ఆయనకు అవరోధంగా మారింది. పైగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే చెందిన ప్రేమ్‌సాగర్‌రావు.. వివేక్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మద్దతుతో ఆయన తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్‌ జిల్లా నుంచి మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తున్నారు.


నల్లగొండ జిల్లాతో పీటముడి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలునాయక్‌ల పేర్లపై నిర్ణయం తీసుకునే విషయంలో అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎస్టీ లంబాడా నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. ఆ వర్గంలో సీనియర్‌గా బాలునాయకే కనిపిస్తున్నారు. అయితే అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ మేరకే రాజగోపాల్‌రెడ్డి పార్టీలో తిరిగి చేరారని, ఆ హామీని నెరవేర్చాలంటూ ఆయన పట్టు బడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉండడం, జిల్లాకు చెందిన బాలునాయక్‌ రేసులో ఉండడంతో వారిద్దరిపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి టి.రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. హామీలు, సామాజిక సమీకరణలు, రేవంత్‌, భట్టి, మహేశ్‌గౌడ్‌, ఉత్తమ్‌ల అభిప్రాయాలతో ముడిపడి ఉన్నందున.. జటిలంగా ఉన్నవాటిని పెండింగ్‌లో పెట్టి, ఈ దఫా విస్తరణలో నలుగురినే తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ అధికార ప్రతినిధులను అధిష్ఠానం వారంలోపే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి మూడు పేర్ల చొప్పున అధిష్ఠానానికి రేవంత్‌, భట్టి, మహేశ్‌గౌడ్‌, ఉత్తమ్‌ ఇచ్చినట్లు తెలిసింది. రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్లను తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. రెడ్డి సామాజికవర్గం నుంచి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిల పేర్లు పరిశీలనకు ఇచ్చారు. ఎస్సీ మాదిగ నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతమ్‌, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. లంబాడా వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్‌, టీపీసీసీ ఎస్టీ సెల్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ల పేర్లు పరిశీలిస్తున్నారు. ముస్లిం మైనారిటీల నుంచి ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు అజరుద్దీన్‌, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్‌ఖాన్‌, పార్టీ నేత ఫహీం ఖురేషీల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


ప్రతి జిల్లాకూ ప్రాతినిధ్యం..

ఈసారి అధికార ప్రతినిధులను పరిమిత సంఖ్యలో తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న అధిష్ఠానం.. కార్యనిర్వాహక అధ్యక్షులతోపాటుగా వారి నియామకాన్నీ జరపనుంది. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకం విషయంలోనూ పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. ప్రతి జిల్లాకూ ప్రాతినిథ్యం దక్కేలా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కూర్పు జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలోకి కొత్తగా వచ్చినవారు, పదేళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్నవారి మధ్య వివాదం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ రాకపోవడంతో పార్టీపై విమర్శలు చేసి.. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అనేక మంది నాయకులు ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తమ పూర్వ పదవులు తిరిగి దక్కించుకునేదుకు వారు ప్రయత్నాలు చేస్తుండగా.. పార్టీలోనే ఉండి ఆయా పదవులు ఆశిస్తున్నవారు అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వివాదాలను పరిష్కరించేందుకు మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున.. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకం మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 04:08 AM