Share News

MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:26 AM

కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఊటుకూరి నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ప్రకటించింది.

MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటన

కరీంనగర్‌, న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఊటుకూరి నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమోదించగా.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కరీంనగర్‌-మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే కాంగ్రెస్‌ పార్టీ తాత్సారం చేయకుండా అభ్యర్థిని ఖరారు చేసింది. నిజానికి ఈ స్థానానికి సిటింగ్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేరునే అధిష్ఠానం వద్దకు టీపీసీసీ పంపింది. కానీ పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేయడంతో నరేందర్‌ రెడ్డి పేరు పంపింది.


పార్టీకే చెందిన వెలిచాల రాజేందర్‌ రెడ్డి కూడా చివరివరకూ పోటీపడ్డా.. అధిష్ఠానం నరేందర్‌ రెడ్డి పేరుకే పచ్చజెండా ఊపడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఎమ్మెల్సీ నియోజకవర్గం నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉన్నా.. కరీంనగర్‌ జిల్లాలోనే పట్టభద్రులు ఎక్కువగా ఉన్నారనే అంచనాల నేపథ్యంలోనే.. కరీంనగర్‌కు చెందిన నరేందర్‌రెడ్డిని అధిష్ఠానం ఖరారు చేసినట్టు చర్చ జరుగుతోంది. కాగా.. నరేందర్‌రెడ్డి ఇప్పటికే నాలుగు నెలలుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని వర్గాల మద్దతూ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దఎత్తున ఓటర్ల నమోదు ప్రక్రియనూ చేపట్టారు. పలు కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి.. పట్టభద్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి వారి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

Updated Date - Feb 01 , 2025 | 04:26 AM