జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:57 AM
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసెంబ్లీ సాక్షిగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ నిరసనలు
జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసెంబ్లీ సాక్షిగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసి బీఆర్‌ఎస్ వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్పీకర్‌ను అవమానించిన జగదీశ్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ పంజాగుట్ట పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మీర్‌పేట్, బడంగ్‌పేట చౌరస్తా, హయత్‌నగర్, బంజారాహిల్స్, మైలార్‌దేవ్‌పల్లి, మణికొండ, చందానగర్, మియాపూర్‌లలో బీఆర్‌ఎస్ నేతల దిష్టి బొమ్మల దహనం చేసి.. ఆందోళనలు చేశారు.
లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం యువజన కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. కూకట్‌పల్లి వివేకానందనగర్ రిక్షాపుల్లర్స్ కాలనీలో చేపట్టిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీశాయి. ఇటు వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. హనుమకొండ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఇందులో పాల్గొన్నారు. భువనగిరి జిల్లా కేంద్రం లో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇటు ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించారు.