Share News

Bokkamuntalapahad News: ప్రియుడు మోసం చేశాడని విషం తాగి దళిత యువతి బలవన్మరణం

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:03 AM

ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో దళిత యువతి మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. జాన్‌రెడ్డి అనే యువకుడిపై మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

 Bokkamuntalapahad News: ప్రియుడు మోసం చేశాడని విషం తాగి దళిత యువతి బలవన్మరణం

  • ప్రియుడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన

  • సూసైడ్‌ నోట్‌ స్వాధీనం.. ప్రియుడి అరెస్టు

నిడమనూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రియుడు తనను మోసం చేశాడనే ఆవేదనతో ఆమె కుమిలిపోయింది. తనను ప్రేమించానని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనకు తెలియకుండా మరో యువతిని వివాహం చేసుకున్నాడనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ధర్మారపు మల్లీశ్వరి అనే 27 ఏళ్ల దళిత యువతి. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కముంతలపహాడ్‌ గ్రామ వాస్తవ్యురాలు. సరూర్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. బొక్కముంతలపహాడ్‌ గ్రామానికే చెందిన కుక్కల జాన్‌రెడ్డి అనే యువకుడు హైదరాబాద్‌లోనే ఓ రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. మల్లీశ్వరి, జాన్‌రెడ్డి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మల్లీశ్వరికి చెప్పకుండా జాన్‌రెడ్డి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసి డిప్రెషన్‌లోకి వెళ్లిన మల్లీశ్వరి సోమవారం తెల్లవారుజామున హాస్టల్‌లోని మరుగుదొడ్డిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. లోపలి నుంచి ఆమె ఎంతకూ బయటకు రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి మరుగుదొడ్డి తలుపులు పగులగొట్టి మల్లీశ్వరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు చెప్పారు.


మల్లీశ్వరి తల్లిదండ్రులు కోటమ్మ, పాపయ్య సోదరుడు శివకుమార్‌, బంధువులు హైదరాబాద్‌కు చేరుకుని పోస్టుమార్టం అనంతరం మల్లీశ్వరి మృతదేహాన్ని సోమవారం రాత్రికి స్వగ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహంతో సోమవారం రోజంతా, మంగళవారం ఉదయం దాకా జాన్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు. మంగళవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల దాకా కోదాడ-జడ్చర్ల హైవేపై ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మల్లీశ్వరి కుటుంబీకులకు నచ్చజెప్పారు.. మల్లీశ్వరి మృతికి కారణాలపై పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామనిహామీ డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జాన్‌రెడ్డిని సరూర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లీశ్వరి సూసైడ్‌ నోట్‌ సైతం సరూర్‌నగర్‌ పోలీసులకు లభించనట్లు తెలుస్తోంది.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 05:03 AM