Rythu Bharosa Scheme: ఆంక్షల్లేని భరోసా!
ABN, Publish Date - Jan 03 , 2025 | 02:43 AM
రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే! ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తే అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపర్చాలి! ఉదాహరణకు పదెకరాలున్న రైతు, ఏడెకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలే పొందుపర్చాలి!
ఎకరాల పరిమితి లేదు.. ఐటీ చెల్లింపుదారులకూ వర్తింపు
పంటలు వేసిన రైతులకే పథకం.. 14 నుంచి జమ!
రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలున్న భూములకు బంద్
భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే
పంటలు వేసినట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే చెల్లింపులు
అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్
5, 6, 7 తేదీల్లో గ్రామసభలు.. దరఖాస్తుల స్వీకరణ
కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం
రేపు నిర్వహించే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే! ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తే అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపర్చాలి! ఉదాహరణకు పదెకరాలున్న రైతు, ఏడెకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలే పొందుపర్చాలి! పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇన్ని ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అంటూ రైతుభరోసాపై ఎలాంటి పరిమితి విధించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే దున్నేవారికి మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు సాగు చేసిన పంటలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలనీ ప్రతిపాదించింది. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగుచేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రతిపాదించారు.
గురువారం సచివాలయంలో మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి సమావేశమై ఈమేరకు కీలక ప్రతిపాదనలు చేశారు. శనివారం (4వ తేదీ) నిర్వహించనున్న క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలపై చర్చించి.. రైతుభరోసా పథకం విధివిధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు. బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతుభరోసా ఇవ్వరు! ఈనెల 5, 6, 7 తేదీల్లో క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి నుంచి అంటే.. ఈనెల 14వ తేదీ నుంచి యాసంగి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు నుంచి నెలరోజుల పాటు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం తాలూకు డబ్బులు పడతాయి. ధరణి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమి ఉంది. గత ప్రభుత్వం ప్రతి సీజన్ (వానాకాలం, యాసంగి)లో కూడా కోటిన్నర ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేసింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా... ఈ ప్రభుత్వం ఎకరానికి రూ. 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధులు దుర్వినియోగమయ్యాయని, సాగుచేయని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు చేసిన భూములకు కూడా రైతుబంధు చెల్లించటంతో ప్రజాధనం దుర్వినియోగ మైందనే విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఈ లెక్కలు కూడా వెల్లడించింది. పంటలు సాగుచేయని భూములకు గత ప్రభుత్వం రూ. 21,284 కోట్లు చెల్లించిందని అసెంబ్లీలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. రైతుభరోసా పథకానికి మార్గదర్శకాలు కొత్తగా రూపొందించాలని భావించిన ప్రభుత్వం... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి, ప్రజాభిప్రాయాలను సేకరించింది. తాజాగా డిసెంబరు 29న ఉపసంఘం సభ్యులు సమావేశమై ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొద్దు? అని అంశాలతోపాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రజల అభిప్రాయాలపై చర్చించారు. వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ... పంటలు సాగుచేయకపోతే రైతుభరోసా ఇవ్వొద్దని, పంటలు సాగుచేస్తే మాత్రం రైతు భరోసా ఇవ్వాల్సిందనే ఆలోచనకు ఉపసంఘం సభ్యులు వచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులకు కూడా ఇవ్వాలా? వద్దా? పీఎం- కిసాన్ నిబంధనలను ఏమేరకు పరిగణనలోకి తీసుకోవాలి? అనే అంశాలపై గురువారం నిర్వహించిన ఉపసంఘం సమావేశంలో చర్చించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్లు... తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు (జీతాలు పొందేవారు, పెన్షనర్లు), ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులకు పీఎం- కిసాన్ పథకంలో పెట్టుబడి సాయం అందటంలేదు. తొలుత ఈవర్గాలకు రైతుభరోసా ఇవ్వొద్దనే ఆలోచన చేసినప్పటికీ.. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించిన తర్వాత... ఈ కేటగిరీల్లో ఉన్నవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని గురువారం నిర్వహించిన భేటీలో చర్చించి కేబినెట్‌కు సిఫారసు చేశారు. రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆమోదిస్తే... పంటలు సాగుచేయని భూములకు తప్ప... మరే ఇతర షరతులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ధరణి లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉంది. వానాకాలం సీజన్‌లో గరిష్ఠంగా 130 లక్షల(1 కోటి 30 లక్షల) ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అంటే 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయటంలేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే... 20 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేనట్లు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, స్థిరాస్తి వెంచర్ల జాబితాల్లో ఈ భూమి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Updated Date - Jan 03 , 2025 | 02:43 AM