Share News

అటవీ భూముల్లో చెలరేగిన మంటలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:20 AM

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని అటవీభూముల్లో మంటలు చెలరేగి రెండు ఎకరాల పరిధిలో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

అటవీ భూముల్లో చెలరేగిన మంటలు
అడవిదేవులపల్లిలోని అటవీ ప్రాంతంలో దగ్ధమవుతున్న చెట్లు

మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో ఘటన

అడవిదేవులపల్లి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని అటవీభూముల్లో మంటలు చెలరేగి రెండు ఎకరాల పరిధిలో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అడవిదేవులపల్లి మండలం కేంద్రం నుంచి సత్రశాలకు వెళ్లే దారిలో 53వ బీట్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అగ్నిప్రమాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... అడవిదేవులపల్లి ఫారెస్ట్‌ బీట్‌లో 900 హెక్టార్లల్లో అడవులు వ్యాపించి ఉన్నాయి. సత్రశాలకు వెళ్లే దారిలో పలు రకాల చెట్లతో కూడిన అడవి విస్తరించి ఉంది. సోమవారం కొంతమంది బాటసారులు సిగరెట్‌ తాగి ఆర్పివేయకుండా పడవేయడంతో గడ్డి తుప్పలకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగినట్లు తెలిపారు. అటవీశాఖ వాచర్లు మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా గాలివాటుకు మరింతగా చెలరేగాయి. దీంతో మిర్యాలగూడ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మిర్యాలగూడకు చెందిన ఐదుగురు ఫైర్‌మెన్లు ఫైరింజన్‌తో అరగంటలో సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు వాచర్లు, బీట్‌ ఆఫీసర్‌ సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ 53వ బీట్‌లో సంఘటన జరిగిన ప్రాంతంలో అటవీభూముల్లో రెండువైపులా దారి ఉండటం, అగ్ని ప్రమాదం సంభవించిన నిమిషాల వ్యవధిలోనే ఫారెస్ట్‌ వాచర్లు స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. సిబ్బంది అప్రమత్తమై ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించి మంటలు ఆర్పివేయడంతో పెద్దగా నష్టం సంభవించలేదని అన్నారు. రెండు ఎకరాల పరిధిలో చిన్నచిన్న ముళ్ల పొదలు, పలు రకాల చెట్లు దగ్ధమయ్యా యని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంతో అటవీ జంతువులు, పక్షులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

Updated Date - Apr 15 , 2025 | 12:20 AM