‘భూభారతి’కి గవర్నర్ ఆమోదం!
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:42 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి-2024 చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలను అందించేలా కొత్త చట్టాన్ని అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

ఇది ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన చట్టం
త్వరలోనే అమల్లోకి.. ప్రజలకు మెరుగైన సేవలు: పొంగులేటి
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి-2024 చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలను అందించేలా కొత్త చట్టాన్ని అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా నిబంధనలు రూపొందించి చట్టాన్ని అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు సమగ్ర రెవెన్యూ సేవలందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని గురువారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి వల్ల తెలంగాణలో సామాన్యులు, రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.
గత ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కొందరి గుప్పిట్లో, కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామ స్థాయి వరకు సమర్థంగా అందించడానికి తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించబోతున్నామని, సంబంధిత కసరత్తు కొలిక్కి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని, ఈ చట్టాన్ని ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అలాగే చట్టం తీసుకురావడానికి అన్ని విధాలా సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సహచర మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, రేయింబవళ్లు శ్రమించి చట్టాన్ని రూపొందించిన అధికారులకు ఽకృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ నేపథ్యం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జనవరిలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ధరణిని సవరించాలా? లేక కొత్త చట్టం తేవాలా? అనే అంశంపై ఈ కమిటీ చర్చించింది. భూ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు చూపాలంటే చట్టాన్ని మార్చాలనే అభిప్రాయం వ్యక్తమవడంతో మార్చి 2024 నుంచి భూభారతి ముసాయిదా బిల్లుపై ప్రభు త్వం దృష్టి పెట్టింది. 2024 డిసెంబరు 18న అసెంబ్లీలో, 21న మండలిలో బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లుకు గురువారం గవర్నర్ ఆమోదం తెలిపారు.
నిబంధనల్లోనూ ప్రజల భాగస్వామ్యం ఉండాలి
ప్రజల భాగస్వామ్యంతో తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు కోసం రూపొందించే నిబంధనల్లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూస్తే చట్టం లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ ప్రజల భూమి హక్కుల రికార్డుల సమస్యల పరిష్కారంలో భూభారతి కీలక మజిలీ అవుతుంది. ప్రజాస్వామ్యయుతంగా రూపొందించిన చట్టం అదే స్ఫూర్తితో భూ సమస్యలు తీర్చాలి.
- సునీల్, భూచట్టాల నిపుణుడు