Harish Rao: రేవంత్‌కు మాటలెక్కువ చేతలు తక్కువ: హరీశ్
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:17 AM
పంటలకు బీమా చేయిస్తామని చెప్పి మాటతప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

చిన్నకోడూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): పంటలకు బీమా చేయిస్తామని చెప్పి మాటతప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు రైతుబంధు డబ్బు పడలేదని, రుణమాఫీ కాలేదని, అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇచ్చేదాక పోరాడుతామని చెప్పారు. ఏ రైతును అడిగిన రుణమాఫీ కాలేదని చెప్తున్నారని, కేవలం 40ు రుణమాఫీ అయిందని, ఇంకా 60ు కాలేదన్నారు.
రైతు బంధు సగం మంది కూడా పడలేదని, ఈ ప్రభుత్వం రైతులకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వనజీవి రామయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించడం హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని విమర్శించారు. చెట్లు నరుకుడు సీఎం రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతని వ్యాఖ్యానించారు. అలాంటి ముఖ్యమంత్రికి వనజీవి రామయ్యకు సంతాపం తెలిపే హక్కులేదన్నారు. హార్టికల్చర్ వర్సిటీలో 100 ఎకరాల్లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 150 ఎకరాల్లో చెట్లను నరికారని, చెట్ల రక్షణ గురించి సీఎం పట్టించుకోవడం లేదన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్‌ఎస్ తరఫున హరీశ్‌రావు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.