Share News

Harish Rao: రేవంత్‌రెడ్డి విధ్వంసాన్ని ఆపరేం?

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:47 AM

రేవంత్‌ రెడ్డి వైఖరి కారణంగా కంచ గచ్చిబౌలిలోని వందల ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, నెమళ్లు సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి విధ్వంసాన్ని ఆపరేం?

  • తెలంగాణలో బుల్డోజర్‌రాజ్‌ను పట్టించుకోరా?

  • రాహుల్‌కు మాజీ మంత్రి హరీశ్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌/ సిద్దిపేట టౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశవ్యాప్తంగా బుల్డోజర్‌ రాజ్‌ను వ్యతిరేకిస్తున్న మీరు తెలంగాణలో రేవంత్‌రెడ్డి విధ్వంసాన్ని ఆపరెందుకు? హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట పేద, మధ్యతరగతి ఇళ్లను కూలగొడుతూ.. బుల్డోజర్‌ పాలన చేస్తుంటే ఎందుకు పట్టించుకోరు రాహుల్‌జీ’’ అని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ మేరకు లోక్‌సభాపక్షనేత రాహుల్‌గాంధీకి శుక్రవారం ఆయన బహిరంగ లేఖరాశారు. రేవంత్‌ రెడ్డి వైఖరి కారణంగా కంచ గచ్చిబౌలిలోని వందల ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, నెమళ్లు సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ దుర్మార్గంపై ఆందోళన చేస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీచార్జి చేయడం.. అందరినీ కలిచివేసిందన్నారు. ‘‘రోహిత్‌ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్‌సీయూను సందర్శించిన మీరు.. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హెచ్‌సీయూ విద్యార్థులకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. హెచ్‌సీయూ విషయంలో మీరు, మీ పార్టీ మౌనంగా ఉండడానికి కారణం తెలపాలని విద్యార్థులు, తెలంగాణ ప్రజల తరపున డిమాండ్‌ చేస్తున్నా. పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టం తెస్తామని మీరు హామీ ఇవ్వగా.. ఇక్కడ మీ ముఖ్యమంత్రే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాల్లో మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు’’ అని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.

Updated Date - Apr 05 , 2025 | 03:47 AM