Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

ABN, Publish Date - Mar 13 , 2025 | 11:04 AM

Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీష్‌ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
Congress vs BRS

హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టేచర్ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy బీఆర్‌ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదంటూ హస్తం నేతలు హెచ్చరికలు జారీ చేశారు. సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారని కాంగ్రెస్ నేతలు తెలుపగా.. రేవంత్ రెడ్డిని పిచ్చికుక్కలతో పోల్చారు బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఇంతకీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎవరెవరు ఏం మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం.


నోరు అదుపులో పెట్టుకోండి: ఆది శ్రీనివాస్

స్టేచర్ గురించి ముందు మాట్లాడింది కేటీఆర్ అని.. సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేమైనా ఉంటుందా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ‘‘కేటీఆర్ మీకు నాయకుడు కావొచ్చు కానీ సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారన్నారు. తెలంగాణలో సీఎం పదవి కంటే ఇంకేమి స్టేచర్ ఉండదని స్పష్టం చేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు పదవులు తీసుకొని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే ప్రజలు మీ స్టేచర్‌ను దింపి... సీఎంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు. ‘హరీష్ రావు మీ నోరును అదుపులో పెట్టుకోండి. ఇష్టనుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు.. 10 ఏళ్లు పందికొక్కులాగా రాష్ట్రాన్ని దోచుకున్న మీరు మాట్లాడుతున్నారా. ఈ రోజు 18 గంటలు కష్టపడి సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలి’’ అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.


హరీష్.. జాగ్రత్త బిడ్డ: బీర్ల ఐల్లయ్య

హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారని.. తెలంగాణ ప్రజానీకం గమనిస్తోందని తెలిపారు. ప్రజా ప్రతినిధుల్లా కాకుండా పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, గవర్నర్, ముఖ్యమంత్రి అంటే బీఆర్‌ఎస్‌కు విలువలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టే స్థాయి లేని వారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వీళ్ళు పది సంవత్సరాలు చేయని అభివృద్ధిలో 15 నెలల్లో చేస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదన్నారు. ‘మీలా దొంగ దీక్షలు చేయలేదు. పెట్రోల్ దొరికినా అగ్గిపెట్టె దొరకలేదు అనే విధంగా మేము చేయలే. ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. నోరు అదుపులో పెట్టుకో. మీ బలుపు, వాపు మీ దగ్గరే పెట్టుకోండి. హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నిన్ను గ్రామాల్లో తరిమికొట్టే రోజులు ముందు ఉన్నాయి. మీరు చేసిన తప్పులు, అప్పులు సరిదిద్దుకుంటూ వస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ఇది చూసి ఓర్వలేకే దిగజారుడు రాజకీయాలు. ఈరోజు రాష్ట్రం దివాలా తీయడానికి కారణం మీ మామ అల్లుళ్లు. సిగ్గులేకుండా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు క్షమాపణలు చెప్పాలి’ అంటూ ఐలయ్య డిమాండ్ చేశారు.


ఆ విషయం గుర్తు పెట్టుకో రేవంత్: పాడి కౌశిక్ రెడ్డి

రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయని.. ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతోందన్నారు. 4వేల పెన్షన్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు 4 ఎకరాల పంట ఎండిపోతుంది అనుకోలేదని చిన్నపిల్లవాడు చెప్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. పంటలు ఎండిపోతుంటే కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో వచ్చిన కరెంటు, రైతుబంధు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద ఉన్న కక్ష్యతోనే పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీళ్లు వదలకపోతే రైతులను తీసుకొని తాను రోడ్డెక్కుతా అని హెచ్చరించారు. కేసీఆర్ కంటే గొప్ప పాలన చేసే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదన్నారు.


15 నెలల స్కాంగ్రేస్ పాలన.. 15 నెలలు 15 స్కాములు జరిగాయన్నారు. ఈ స్కాంగ్రెస్ పాలలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును ప్రజలు చూస్తున్నారన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ అభివృద్ధిని దేశానికి చూపెట్టారు కేసీఆర్ అని అన్నారు. సిగ్గు, శరం లేకుండా కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సభా ప్రతిపక్ష నేత చావు కోరుతున్నారన్నారు. వందల మంది ఎల్ఓపీ లీడర్లు అయ్యారు కానీ ఎవరు కూడా చావును కోరుకోలేదన్నారు. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని.. కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేటా అని అన్నారు. ‘కేసీఆర్ చావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ కేసీఆర్ చచ్చే వ్యక్తి కాదు తెలంగాణను చావు నోట్లో తలపెట్టి తెచ్చిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత అయ్యేవాడా. నీకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనే విషయం గుర్తు పెట్టుకో’ అని అన్నారు.


ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు పెడుతున్న శాపనార్థాలకు కుక్క చావు చచ్చేది రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతులు రైతుబంధు రాలేదని, రుణమాఫీ కాలేదని నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని ఒక జర్నలిస్టు‌కు ఇంటర్వ్యూ ఇస్తే ఆ జర్నలిస్టును బెయిల్ రాకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారని.. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ‘నువ్వు సక్కగా పాలన చేస్తే జర్నలిస్టులు రైతులు నిన్ను తిట్టేవారు కాదు కదా. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి’ అంటూ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే: గంగుల కమలాకర్

‘2009 నుంచి నేను అసెంబ్లీలో ఉన్న. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి సీఎంలను చూశాను. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూస్తున్న. చంద్రబాబు నాయుడు లాంటి నేతలను చూశాం. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లాగా చూస్తున్నడు. కానీ మేము తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నాం. కేసీఆర్‌ను చావాలని కోరుకుంటావా? రేవంత్ రెడ్డిని ఒక వ్యక్తిగా చూడలేదు. నిన్ను ఒక సీఎంగా చూస్తున్నాం. తెలంగాణ సీఎం అని రేవంత్ రెడ్డి అనుకుంటే పితృ సమానులైన కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి. ఒక తండ్రిలాగా ఉన్న కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 13 , 2025 | 11:11 AM