Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..
ABN, Publish Date - Mar 15 , 2025 | 11:55 AM
summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్: ఎండాకాలం మొదలవడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. డేంజర్ బెల్స్‌తో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు వెళ్తే చాలు ఎండ వేడితో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. మధ్యాహ్నమే కాదు సాయంత్రం కూడా ఎండ తగ్గడం లేదు. మార్చి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే పోను పోను ఎండలు ఇంకెంతగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
వాతావరణ ప్రభావంతో..
ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కేరళలో అతినీలలోహిత కిరణాలు తీవ్ర రూపం దాల్చాయని చెప్పారు. వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొరకు రంధ్రాలు, తదితర కారణాలతో అతినీలలోహిత కిరణాలు అత్యంత ప్రమాదకర విభాగంలోకి చేరింది. దీంతో కేరళలోని ఆయా జిల్లాల్లో ఆ రాష్ట్ర విపత్తు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అతినీలలోహిత కిరణాలు ప్రమాదపు కేటగిరిలో ఉండటంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో యువీ కిరణాలు 11 పాయింట్లుగా రికార్డు అయింది. యువీ కిరణాలు 11 పాయింట్లు దాటితే అతి ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించారు.
అనారోగ్య సమస్యలు..
యువీ కిరణాల శాతం పెరిగే కొద్దీ ఓజోన్ పొర మందం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓజోన్ పొర ప్రభావం తగ్గడంతో మనుషుల్లో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా కళ్లు మండటం, చర్మ సంబంధిత సమస్యలు, తదితర కారణాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిఫుణలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని ప్రభావం ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిఫుణలు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్
BJP: వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 15 , 2025 | 12:13 PM