Danam Nagender: స్వరం మార్చిన ఎమ్మెల్యే.. ప్రభుత్వంపై ఫైర్.. అధికారులపై ఆగ్రహం..
ABN , Publish Date - Jan 23 , 2025 | 11:58 AM
Danam Nagender: తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని... కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.

హైదరాబాద్, జనవరి 23: ఫుట్‌పాత్ కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) మరోసారి సీరియస్ అయ్యారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం అయినా అధికారులకు స్వేచ్ఛను ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని... కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.
తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని... హైదరాబాద్‌లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం ముందుంటాడని స్పష్టం చేశారు. గతంలో తాను హైడ్రా విషయంలో మాట్లాడినా.. ఇప్పుడు ఫుట్‌పాత్‌ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇటీవల మాదాపూర్‌లో ఫుట్‌పాత్‌లపై కుమారి ఆంటీని వేధిస్తున్నప్పుడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో.. ఇప్పుడు ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారన్నారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండ్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మొదలు పెడితే అక్కడి నుంచే తొలగింపులు చేయాలన్నారు. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
‘‘నాకు నిద్ర ఉండడం లేదు... అక్కడ కూల్చివేస్తున్నారు... ఇక్కడ కూల్చివేస్తున్నారు అని పేదలు ప్రతి రోజు నా దగ్గర కు వస్తున్నారు. పేద ప్రజల శాపనార్ధాలు ప్రభుత్వానికి మంచిది కావు. బస్తీలో పేద ప్రజల ఇళ్ళు, షాప్‌లు కూల్చివేస్తే ప్రభుత్వానికి మంచిది కాదు. బ్యూరో క్రట్స్ ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. ఖైరతాబాద్, చింతల్ బస్తీలో దశబ్దాలుగా షాపులు, హోటల్స్ పెట్టుకొని బతుకుతున్న వారి షాపులను ఆపరేషన్ రూప్ పేరుతో కూల్చివేస్తే ఎలా? ఆపరేషన్ రూప్ ముందు ఓల్డ్ సిటీలో చేయండి’’ అంటూ ఎమ్మల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. నిన్న (బుధవారం) జీహెచ్‌ఎంసీ అధికారులపై దానం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటిని కూల్చివేసే పనిలో పడ్డారు. ట్రాఫిక్ పోలీసులతో కలిసి అక్రమాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని హల్‌చల్ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ధమ్కీ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడకు బతకడానికి వచ్చి.. ఇక్కడున్న తమను బతకనియ్యరా అంటూ మండిపడ్డారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే అడ్డుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి..
సైఫ్ అలీఖాన్ కేసులో నిజాన్ని దాచిపెడుతున్నారా..!
Read Latest Telangana News And Telugu News