Share News

Warangal: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి..

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:27 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ట్రేడింగ్‌.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

Warangal: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి..

  • రూ.30 లక్షలు అప్పులు చేస్తే కట్టేసిన తండ్రి

  • మళ్లీ అప్పులు చేసి ఉరేసుకున్న యువకుడు

  • ట్రేడింగ్‌ పేరిట రూ.2 లక్షలు పోగొట్టుకొని

  • గృహిణి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వేర్వేరు చోట్ల ఘటనలు

వర్ధన్నపేట రూరల్‌/మరిపెడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ట్రేడింగ్‌.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల్లో రూ.30 లక్షలకు పైగా నష్టపోయి ప్రాణం తీసుకోగా.. ట్రేడింగ్‌ పేరిట మరో గృహిణి రూ.2 లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి కుమారస్వామి, సోమలక్ష్మి దంపతుల మూడో కుమారుడైన రాజ్‌ కుమార్‌ (28) మూడేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగులు పెడుతూ దాదాపు రూ.30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇందుకోసం తెలిసిన వారు, ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అప్పులు చేశాడు. చివరకు తండ్రికి విషయం చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆయన ఉన్న ప్లాటును అమ్మి అప్పులు తీర్చేశాడు.


అయితే ఎలాగైనా పోయిన డబ్బులు సంపాదించాలని రాజ్‌కుమార్‌ మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్‌లు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అప్పుల వాళ్ల వేధింపులు పెరగడంతో ఐదు రోజుల క్రితం తండ్రిని రూ.4 లక్షలు అడిగాడు. తండ్రి లేవని చెప్పడంతో రాజ్‌కుమార్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మునిసిపల్‌ కేంద్రంలోని గ్యామతండాకు చెందిన గుగులోత్‌ శైలజకు వారం క్రితం ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి, ట్రేడింగ్‌ చేస్తే రూపాయికి రూపాయి లాభం వస్తుందని ఆశచూపాడు. తొలుత రూ.5 వేలు పెట్టుబడి పెట్టగా రూ.10 వేలు ఇచ్చారు. మరోసారి రూ.50 వేలు పెట్టగా రూ.60 వేలు ఇచ్చారు. దీంతో వారిని నమ్మిన ఆమె ఏకంగా రూ.2 లక్షలు చెల్లించింది. ఈ క్రమంలో ఆ సైబర్‌ మోసగాళ్లు మరో రూ.4 లక్షలు చెల్లిస్తే రూ.20 లక్షలు వస్తాయని నమ్మబలికారు. కానీ అప్పటికే తాను చెల్లించిన రూ.2 లక్షలు రాకపోవడం, ఈలోపు కుటుంబసభ్యులకు విషయం తెలియడంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jan 12 , 2025 | 04:27 AM