Share News

IMD Monsoon Report: నైరుతిలో వానలే వానలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:37 AM

భారత వాతావరణ శాఖ ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్సరం 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది

 IMD Monsoon Report: నైరుతిలో వానలే వానలు

  • ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

  • దీర్ఘకాలిక సగటులో 105% నమోదు

  • ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య భారతంలో

  • ఎక్కువగా వానలు పడే అవకాశం

  • జమ్మూకశ్మీర్‌, బిహార్‌, తమిళనాడు,

  • ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ

  • భారత వాతావరణ శాఖ వెల్లడి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): దేశంలోని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ మంగళవారం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్‌-సెప్టెంబరు) సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటులో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ‘దేశంలో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్ల వర్షపాతంతో పోల్చుకుంటే.. 105% ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం’’ అని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. రుతుపవన వేగాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో పరిస్థితులు ఈ దఫా తక్కువగానే ఉంటాయని తెలిపారు. దేశంలో సుమారు 43 శాతం మంది వ్యవసాయ రంగంపై అధారపడి జీవిస్తుంటారు. మొత్తం వ్యవసాయ కమతాలలో 52 శాతం వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. అధిక వర్షపాతం నమోదు అంచనాల నేపథ్యంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన ఆర్థిక రంగాలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 18 శాతంగా ఉన్న నేపథ్యంలో ఇది మరింత పెరగడం లేదా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదిలావుంటే, సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసినా.. దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది 106ు వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేయగా, 108ు నమోదు కావడం గమనార్హం.


మెజార్టీలో ప్రాంతాల్లో అధిక వానలే

నాలుగు నెలల నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి భారత వాతావరణ శాఖ ఈ తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కోర్‌ మాన్‌సూన్‌ ప్రాంతంగా పిలిచే మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కానున్నది. అయితే దక్షిణాదిలో తమిళనాడు, ఉత్తరాదిలో జమ్మూకశ్మీర్‌, తూర్పు భారతంలో బిహార్‌, ఈశాన్య భారతంలోని అనేక రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా తాజా నివేదికపై సవరించిన బులెటిన్‌ను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయనున్నది.

నైరుతికి పరిస్థితులు సానుకూలం

ఇదిలా ఉండగా, భూమధ్యరేఖకు ఆనుకుని ఉన్న పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసే వరకు ఈ పరిస్థితులు కొనసాగనున్నాయి. హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (ఐవోడీ) రుతుపవనాల సీజన్‌ ముగిసే వరకూ కొనసాగనున్నాయి. గత మూడు నెలల కాలంలో ఉత్తరార్ధ గోళంలో మంచు కవచం సాధారణం కంటే తక్కువగా కురిసింది. ఉత్తరార్ధ గోళం, యురేషియాపై మంచు కవచం తక్కువగా ఉండడం వంటివి నైరుతి రుతుపవనాల సీజన్‌కు సానుకూలమని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని (103 శాతం) ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ఐదు రోజుల క్రితమే అంచనా వేసింది.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 03:37 AM