Share News

అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:34 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అణగారిన వర్గాల్లో వెలుగులు నింపారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్‌ స్టేడియం నుంచి అంబద్కేర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అణగారిన వర్గాల్లో వెలుగులు నింపారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్‌ స్టేడియం నుంచి అంబద్కేర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహాన్ని శుద్ది చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగునా అవమానించిందన్నారు. దేశ వ్యాప్తంగా అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అంబేద్కర్‌ విగ్రహాలను శుద్ధి చేస్తున్నామన్నారు. అంబేద్కర్‌ చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 1951లో హిందూ కోడ్‌ బిల్లు, సామాజిక న్యాయ సాధికారత అంశాలపై అంబేద్కర్‌ అభిప్రాయాలను నెహ్రూ వ్యతిరేకిస్తే మనస్తాపానికి గురై న్యాయ శాఖ పదవికి రాజీనామా చేశారన్నారు. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి, 1954 ఉప ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థిని పెట్టి అంబేద్కర్‌ను ఓడించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు. అంబేద్కర్‌ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబాయికి తరలిస్తే విమాన ఛార్జీలను చెల్లించాల్సిందిగా అంబేద్కర్‌ భార్యకు రసీదు పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు. అంబేద్కర్‌ ఆశయాల సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీదే అన్నారు.

ఫ నగరంలో భారీ బైక్‌ర్యాలీ

అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో అంబేద్కర్‌ స్టేడియం నుంచి కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర హోంశాఖసహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ స్వయంగా బైక్‌నడుపుతూ నాయ కులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అంబేద్కర్‌ స్టేడియం నుంచి కోతిరాంపూర్‌, కమాన్‌చౌరస్తా, వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, గీతాభవన్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ మీదుగా కోర్టు చౌరస్తాకు చేరుకున్నారు. జైభీమ్‌, జైబీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు.

ఫ మోదీ పాలనను మరవొద్దు...

కరీంనగర్‌ రూరల్‌: మోదీ పాలనను మరవొద్దని, బీజేపీని వీడొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రజలను కోరారు. ఆదివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం జూబ్లీనగర్‌లో బీజేపి చేపట్టిన గావ్‌ చలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికులతో సమావేశమై కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యంలో కేంద్రం 37 రూపాయలు ఖర్చు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. ఈ మాత్రం ఖర్చు చేసి తామే సన్న బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేషన్‌ షాపుల వద్ద ప్రధాని ఫొటో పెట్టాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుతోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌, మండల శాఖ అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:34 AM