చకచకా సాగుతున్న ఆసుపత్రి నిర్మాణ పనులు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:26 PM
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న రామగుండం మెడికల్ హబ్‌గా మారుతోంది. సింగరేణి, ఎన్‌టీ పీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, జెన్‌కో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు వీటిపై ప్రత్య క్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఉన్నారు.

కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న రామగుండం మెడికల్ హబ్‌గా మారుతోంది. సింగరేణి, ఎన్‌టీ పీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, జెన్‌కో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు వీటిపై ప్రత్య క్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఉన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలు, కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడమే లక్ష్యంగా 2023లో సింగరేణి సంస్థ రూ.520కోట్ల నిధులతో మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుబంధంగా రూ.142 కోట్లతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోని స్థలంలో 362 పడకలతో ఐదు అంతస్థుల భవనంతోపాటు 50 పడ కల క్రిటికల్ కేర్ యూనిట్‌ను నిర్మిస్తోంది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతేడాది మార్చి 9న ఐదు అంతస్థుల భవన నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈయేడు ఆగస్టు నెల చివరి కల్లా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే మూడు అంతస్థుల నిర్మాణం పూర్తయి గోడల నిర్మాణం జరుగుతుంది. ఏప్రిల్, మేలో మరో రెండు అంతస్థుల భవనాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
రోజుకు 1500మందికి పైగా ఓపీ సేవలు
మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన తరువాత అన్నీ విభాగాల్లో వైద్య సేవలు అందుతుండడంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. రోజుకు 1500 నుంచి 1700వరకు ఓపీ వస్తుండగా ఇన్‌పేషెంట్లు కూడా భారీగానే పెరుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్, సిర్వంచ ప్రాంతాలతోపాటు పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, లక్సెట్టిపేట, చెన్నూరు, కోటపల్లి, మహాముత్తారం, మంథని, ముత్తారం, కమాన్‌పూర్, రామగిరితో పాటు ఇతర మండలాల నుంచి కూడా భారీగా రోగులు వస్తూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, నర్సింగ్ కళాశాల అందుబాటులో ఉండడంతో పాటు గతంలో కంటే వైద్య సేవలు మెరుగుగా లభించడంతో రోగుల తాకిడి పెరిగింది.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే మరిన్ని సేవలు...
ఐదు అంతస్థుల భవన నిర్మాణం పూర్తయితే మరిన్ని ఎమర్జెన్సీ సేవలు లభించనున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎమర్జెన్సీ, ఐసీయూ, అవుట్ పేషెంట్ విభాగం, బ్లడ్ శాంపిల్ కలెక్షన్, రేడియో డయోగ్నోస్టిక్ సెంటర్, మొదటి అంతస్థులు అవుట్ పేషెంట్, అడ్మినిస్ర్టేషన్, బ్లడ్ ట్రాన్సేషన్, రెండవ అంతస్థులు జనరల్ మెడిసిల్, రిసర్చ్ మెడిసిన్, ఎంఐసీయూ, మూడవ అంతస్థులో జనరల్ సర్జరీ, ఎంఐసీయూ, 4వ ఫ్లోర్‌లో ఆర్థోపెడిక్, పోస్ట్ ఆపరేటివ్ ఆర్థో, పెయిడ్ రూమ్స్, సింగిల్, డబుల్స్ రూమ్స్, 5వ అంత స్థులో పోస్టు ఆపరేటివ్, ఆర్‌ఐసీయూ, ఎన్‌ఐసీయూ, ఓటీలు, ప్రీ ఆపరే టివ్, పోస్టు ఆపరేటివ్ రికవరీ, స్టెప్‌డౌన్ ఐసీయూ, సెంట్రల్ ల్యాబ్, ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌లను కూడా నెలకొల్పనున్నారు.
పాథలాజీ విభాగం...
ఇప్పటికే 362పడకలతో సేవలందిస్తున్న ఆసుపత్రిలో దీనికి అనుగు ణంగా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రూ.2కోట్ల వ్యయంతో పాథలాజీని ఏర్పాటు చేస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఇటీవల గుండెపోటు మరణాల సంఖ్య పెరగడంతో కార్డియో విభాగాన్ని అందుబాటులోకి తీసువస్తున్నారు. ఒకప్పుడు గుండె పోటు వస్తే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వైద్య సేవల కోసం పరుగులు పెట్టే వారు. ఇప్పుడు అన్నీ వైద్య సేవలను ఇక్కడికే అందుబాటులోకి తీసుకువచ్చి ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం తరహాలో వైద్య సేవలను అందించడానికి నిర్మాణాలను రూపొందిస్తున్నారు.
సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడమే లక్ష్యం...
ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్
రామగుండాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్ది ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐదు అంతస్థుల భవన నిర్మాణం పూర్తయితే 767పడకలు అందబాటులోకి వచ్చి అన్నీ డిపార్ట్ మెంట్ల వైద్యులు ఉంటారు. శస్త్ర చికిత్సలతో పాటు ఎమర్జెన్సీ కేసులను కూడా అందుబాటులోకి వస్తాయి. నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశా లలు ఇప్పటికే నెలకొల్పాం. త్వరలో దంత వైద్య కళాశాల కూడా అందుబా టులోకి తీసుకువచ్చి మరిన్ని వైద్యసేవలు అందిస్తాం.