సహకార వ్యవస్థకే కరీంనగర్ ఆదర్శం
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:08 AM
సహకార వ్యవస్థకే కరీంనగర్‌కు ఆదర్శం అని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థకే కరీంనగర్‌కు ఆదర్శం అని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీతి ఆయోగ్, దేశంలోని అనేక సంఘాలే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా బృందాలు చొప్పదండి సహకార బ్యాంకుతోపాటు కేడీసీసీ బ్యాంకును సందర్శించి వ్యాపారం, పరిపాలన తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారన్నారు. ఒరిస్సా నుంచి ఓ బృందం కరీంనగర్‌కు వస్తుందని తెలిపారు. గత ఏడాది కేడీసీసీబీ 800 కోట్ల వృద్ధితో 7,300 కోట్ల వ్యాపారం చేసి 119 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని చెప్పారు. డిపాజిట్లను 2,530 కోట్ల నుంచి 2,850 కోట్లకు పెరిగాయని, రుణాలను కూడా 3,972 కోట్ల నుంచి 4,458 కోట్లకు అంటే 12.20శాతం పెంచి ఇవ్వడం జరిగిందని చెప్పారు. షేర్ క్యాపిటల్ 188.68 కోట్ల నుంచి 216.21 కోట్లకు పెరిగిందని అన్నారు. జిల్లాలో అన్ని బ్యాంకుల కంటే అధికంగా 1515 కోట్ల పంట రుణాలను అందించామని చెప్పారు. కేవలం రైతులకు పంట రుణాలే కాకుండా ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందించాలని 152 కోట్ల హౌజ్‌లోన్స్, 61 కోట్ల ఎడ్యుకేషన్ లోన్స్, స్వశక్తి సంఘాలకు 223 కోట్ల రుణాలను ఏడాదిలోనే మంజూరు చేశామని అన్నారు. 98శాతం రుణాలను వసూలు చేశామని, కేడీసీసీబీ ఆధ్వర్యంలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా 18 శాఖల్లో నూరుశాతం రుణాలు వసూలయ్యాయని చెప్పారు. 128 సంఘాలు లాభాల్లో నడుస్తున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. దాన్యం కొనుగోలు కేంద్రాలను గతంలో మాదిరిగా ప్యాక్ సంస్థలకు అప్పగించాలని, పెట్రోల్ బంక్ ఫైల్స్‌ను క్లియర్ చేయాలని కోరారు. పెద్దపల్లి కలెక్టర్ నాలుగు సంఘాలకు స్థలాన్ని కేటాయించి సోలార్ విద్యుత్ ప్లాట్ల ఏర్పాట్లుకు సహకరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో బ్యాంకు పాలకవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, సీఈవో, పాలకవర్గసభ్యులు, వివిధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.