Share News

ఆన్‌లైన్‌ అవస్థలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:12 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం ఆన్‌లైన్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా యువ కులు ఇబ్బంది పడుతున్నారు.

ఆన్‌లైన్‌ అవస్థలు

- ఓపెన్‌కాని రాజీవ్‌ యువ వికాసం సైట్‌

- రెండు రోజులుగా ఇబ్బందులు

- నెట్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

- ఈనెల 14వ తేదీ చివరితేదీ

మంథని, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం ఆన్‌లైన్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా యువ కులు ఇబ్బంది పడుతున్నారు.

దీంతో ఆన్‌లైన్‌ సెంటర్లకు దరఖాస్తు కోసం వస్తున్న చాలా మంది నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మంథని ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం నుంచి సైట్‌ పని చేయడం లేదు. శుక్రవారం చాలా సెంటర్లల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అప్పుడప్పుడు సైట్‌ పని చేయ డంతో ఒక సెంటర్‌లో ఐదుకు మించి దరఖాస్తులు అప్‌లోడ్‌ కాలేదు. ఒక వేళ అతి కష్టం మీద ఓపెన్‌ అయినా దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్‌ చేస్తే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దీంతో అటు సెంటర్‌ నిర్వాహ కులు, ఇటు దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటు న్నారు. మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డులు, మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్లను, జిరాక్స్‌ కాపీలతో మీసేవ సెంటర్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. ఒక వైపు ఎండ వేడి, మరో వైపు రేపటి నుంచి వరుసుగా 3 రోజుల పాటు సెలవు రోజులు వస్తుండటంతో దర ఖాస్తుదారులు ఆన్‌లైన్‌ సెంటర్ల చేరుకుంటున్నారు. సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్‌ పని చేయక పోవడంతో సెంటర్ల వద్దనే గంటల తరబడి ఎదురు చూస్తూ అవస్థలు పడుతున్నారు. వేర్వేరు ఆన్‌లైన్‌ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే కులం, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగి ఇబ్బందులు పడగా ఆన్‌లైన్‌ కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కాగా, సెలవు దినాల్లో సైతం మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు దారుల అప్లికేషన్లు స్వీకరించడానికి పత్యేక ఏర్పాట్లు చేయడం కొంత ఊరట కల్పించగా రెండు రోజులుగా ఆన్‌లైన్‌ సైట్‌ పని చేయకపోవడం, ఈనెల 14వ తేదీ దరఖాస్తుకు చివరి రోజుగా ఉండటంతో దరఖాస్తుదారు లు ఆందోళన పడుతున్నారు. కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించి రాజీవ్‌ యువ వికాసం ఆన్‌లైన్‌ సైట్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

సెలవు రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తాం

మంథనిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులను సెలవు రోజుల్లో స్వీకరిస్తామని ఎంపీడీవో శశికళ శుక్రవారం తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు మూడు రోజులు సెలవులు ఉన్న ప్పటికి మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తు దారులు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కార్యాలయంలో సంబంధిత ఉద్యోగి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటారన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 02:12 AM