Share News

నిరుద్యోగులకు అందగా రాజీవ్‌ యువ వికాసం

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:53 AM

రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించిన ప్రభుత్వం ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో మున్సిపల్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా నేరుగా దరఖాస్తులు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది.

నిరుద్యోగులకు అందగా రాజీవ్‌ యువ వికాసం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించిన ప్రభుత్వం ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో మున్సిపల్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా నేరుగా దరఖాస్తులు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచడమే కాకుండా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడంలో తరచూ ఇబ్బందులు ఎదురై సర్వర్‌ డౌన్‌ కావడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుదారులు గంటలు, రోజులతరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఈనెల 14వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు పెంచడమేకాకుండా ఆఫ్‌లైన్‌లో ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రూపొందించిన ప్రభుత్వం 27 కాలమ్స్‌లో దరఖాస్తుదారులు వివరాలను నమోదు చేయాలని సూచించింది. ఆధార్‌కార్డు, ఆహారభద్రతకార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగులైతే సదరం ధ్రువపత్రాన్ని జతపరచాలని సూచించింది. ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

రూ. 4లక్షల వరకు ఆర్థికసాయం

రాజీవ్‌ యువ వికాసం పథకం కింద 50వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతీయువకులు స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ రకాల యూనిట్లు నెలకొల్పేందుకు ఈ ఆర్థిక సహాయం అందిస్తారు. 50వేల రూపాయల విలువ చేసే యూనిట్‌కు వందశాతం సబ్సిడీ ఇస్తారు. 50వేలపైబడి లక్ష రూపాయల వరకు 90శాతం సబ్సిడీ లభిస్తుంది. లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు యూనిట్లకు 80శాతం సబ్సిడీ, 2 లక్షలకు పైబడి 4 లక్షల రూపాయల యూనిట్ల వరకు 70శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూర్చుతుంది. సబ్సిడీ పోను మిగతా సొమ్మును లబ్ధిదారులు సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద అన్ని రకాల కేటగిరీల కింద 34,978 దరఖాస్తులు వచ్చాయి. బీసీ సంక్షేమశాఖ ద్వారా 24,200 మంది బీసీ యువతీయువకులు, ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా 7,700 మంది యువతీయువకులు, 629 మంది ఎస్టీలు, 2400 మంది మైనార్టీలు, 49 మంది క్రిస్టియన్లు ఆర్థిక సహాయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫారాలను సంబంధిత కార్యాలయాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండానే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని నిర్ణీత ఫారాన్ని పూరించిన తర్వాత అడిగిన సర్టిఫికెట్లను జతపరిచి ఆయా కార్యాలయాల్లో అందజేస్తే సరిపోతుంది. ్టజౌఛ్చటుఽ్ఛఠీ.ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated Date - Apr 08 , 2025 | 12:53 AM