పత్తి రైతులపై విత్తన భారం
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:18 AM
తెల్లబంగారంపై ఆశలు పెంచుకొని పత్తిసాగు చేస్తున్న రైతులకు వచ్చే వానాకాలం సీజన్‌లో విత్తన భారం తప్పేలా లేదు. ప్రతీయేటా విత్తన ధరలు పెరుగుతున్నా కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు. దీంతో ప్రైవేటు కంపెనీల విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పత్తి రైతులకు విత్తన మోత తప్పడం లేదు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
తెల్లబంగారంపై ఆశలు పెంచుకొని పత్తిసాగు చేస్తున్న రైతులకు వచ్చే వానాకాలం సీజన్‌లో విత్తన భారం తప్పేలా లేదు. ప్రతీయేటా విత్తన ధరలు పెరుగుతున్నా కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు. దీంతో ప్రైవేటు కంపెనీల విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పత్తి రైతులకు విత్తన మోత తప్పడం లేదు. తాజాగా 2025-26 సంవత్సరానికి బీటీ-2 పత్తి విత్తన 475 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.901 నిర్ణయిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, ఈసారి రూ.37 అదనంగా పెంచుతూ నిర్ణయించింది దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులపై అదనంగా రూ.30 లక్షల వరకు భారం పడుతుంది. జిల్లాలో మిడ్‌మానేరు, మల్కపేట, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లతో పాటు ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి నీటిని నింపడం భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లోనూ నీటి మట్టాలు వానాకాలం సీజన్‌లో పెరుగుతున్న క్రమంలో జిల్లాలో రైతులు వరి పత్తిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో పత్తి సాగు జరిగేది. ప్రస్తుతం 50 వేల ఎకరాల వరకు వానాకాలం సీజన్‌లో సాగు చేస్తున్నారు. రానున్న ఖరీఫ్‌లో రైతులు వరితో పాటు పత్తివైపు మొగ్గు చూపుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం విత్తన భారం వేసింది. గతేడాది పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.864 ఉండగా, ప్రస్తుతం రూ.901 వరకు పెంచారు. ఒక ప్యాకెట్‌పై రూ.37 పెరిగింది. దీంతో పాటు ఎరువులు, మందులు, వ్యవసాయ కూలీల ధరలు రైతులకు మరింత భారాన్ని పెంచింది. ఈసారి రైతులు దాదాపు రూ.30 లక్షల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రతియేటా విత్తనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పత్తి పండించే రైతులు ప్రైవేటులోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. రైతులు ఎక్కువగా బీటీ 2 విత్తనాలనే వినియోగిస్తున్నారు. ఎకరానికి రెండు ప్యాకెట్లకు పైగానే ఉపయోగిస్తారు. మరోవైపు అనుకూల పరిస్థితులు లేనిపక్షంలో రెండోసారి కూడా విత్తనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది.
ఫ వెంటాడుతున్న నకిలీ విత్తనాల భయం..
పత్తి రైతులను ధర భారంతో పాటు ప్రతియేటా నకిలీ విత్తనాల భయం వెంటాడుతూనే ఉంది. ఆంధ్రా, ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను ముందుగానే తీసుకవచ్చి పత్తి రైతులకు అంటగడుతున్నారు. బహుళ జాతి కంపెనీల విత్తనాల ధర ఎక్కువగా ఉండడంతో ఎలాంటి లేబుల్ లేకుండా తక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్న పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలు మొలకెత్తని దశలో ల్యాబ్ నంబర్, విత్తన రకం, కంపెనీ పేర్లు లేకపోవడంతో రైతులు పరిహారం పొందే వీలు లేకుండాపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఖరీఫ్‌లో 2.32 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, పత్తి 49,332 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి సాగులో గంభీరావుపేటలో 220 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12,412 ఎకరాలు, ముస్తాబాద్‌లో 760 ఎకరాలు, సిరిసిల్లలో 720 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1,300 ఎకరాలు, వీర్నపల్లిలో 514 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3,900 ఎకరాలు, వేములవాడలో 5,100 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3,950 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి కూడా వరితో పాటు 50 వేల ఎకరాల్లో పత్తి పంటను ప్రధానంగా వేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. పత్తి సాగులో పెట్టుబడులు ప్రతీయేటా పెరుగుతూనే ఉన్నాయి. కూలీల ఖర్చుతో పాటు ఎకరానికి 10 నుంచి 12 వేల రూపాయల వరకు కలుపు తీయడానికే ఖర్చు చేస్తున్నారు. అనుకున్న మేరకు దిగుబడి రాక నష్టపోతున్నారు.
పత్తి విత్తనాల పెరుగుదల ఇలా..
సంవత్సరం ప్యాకెట్ ధర
2019 రూ 710
2020 రూ 730
2021 రూ 767
2022 రూ 810
2023 రూ 853
2024 రూ 864
2025 రూ 901