BRS: కేసీఆర్, హరీశ్‌రావులకు ఊరట
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:38 AM
మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులపై మరోసారి ఊరట లభించింది. ఆ ఉత్తర్వులపై సస్పెన్షన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది.
భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వుల సస్పెన్షన్ మరో రెండు వారాల పొడిగింపు
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులపై మరోసారి ఊరట లభించింది. ఆ ఉత్తర్వులపై సస్పెన్షన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. మేడిగడ్డ కుంగుబాటులో అవినీతి జరిగిందని దాఖలైన ప్రైవేటు ఫిర్యాదులో కోర్టుకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు తదితరులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను హైకోర్టు గత డిసెంబరులో సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
వాటి గడువు ముగియడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలను కొట్టేయాలని కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ బుధవారం మరోసారి జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగిసిపోవడంతో వాటిని పొడిగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. దీంతో జనవరి 22 వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు దిగువ కోర్టుకు కేసీఆర్, హరీశ్‌రావు హాజరుకాకుండా రక్షణ కల్పించింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్‌రావు సహా ఇతరుల అవినీతే కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - Jan 09 , 2025 | 04:38 AM