Kishan Reddy: రాష్ట్రపతినే అవమానిస్తారా..?
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:19 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోనియా, రాహుల్ క్షమాపణ చెప్పాలి
ముర్ము పట్ల వారి వ్యాఖ్యలు సరికాదు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని సోనియా, రాహుల్ గాంధీ అవమానించడం అనాది నుంచి ఆ పార్టీ కొనసాగిస్తున్న సంప్రదాయంలో భాగమేనని విమర్శించారు. విదేశీ శక్తులకు కొమ్ముకాస్తూ, దేశ కీర్తిని దిగజార్చడానికి ఎంతకైనా దిగజారిపోయి పని చేస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు సోనియా, రాహుల్ గాంధీ.. రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను, రాజ్యాంగ వ్యవస్థలను, రాజ్యాంగం ప్రకారం నియమితులై అత్యున్నత పదవులను అలంకరించిన వ్యక్తులను.. దేనినీ, ఎవరినీ వదలకుండా అవమానించే సంప్రదాయాన్ని కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు అనాది నుంచి కొనసాగిస్తూ వస్తున్నారని విమర్శించారు.
అధికార దాహంతో వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్, సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు కాంగ్రెస్ నాయకులు రాజకీయాలను అంటగడతారని, దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఆదివాసీ మహిళను అవమానిస్తారని ధ్వజమెత్తారు. ఉభయ సభలను ఉద్దేశించి దేశం సాధించిన లక్ష్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్రపతి ముర్ము చేసిన ప్రసంగాన్ని ‘బోరింగ్’ అని రాహుల్ గాంధీ మాట్లాడటం దేనికి సంకేతమని కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు