Share News

Komatireddy Rajagopal Reddy: జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:02 AM

ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Komatireddy Rajagopal Reddy: జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర

  • నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు

  • జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం

  • నేను అర్హుడిననుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి

  • రిజర్వేషన్‌ కోటాలో కాదు.. మాటిచ్చారనీ కాదు

  • అధిష్ఠానం ఇస్తానంటే కొందరికి చెమటలు

  • పడ్తున్నయ్‌.. పదవి కోసం అడుక్కునే స్థితిలో లేను

  • అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పా?

  • నాకే ఇలా జరుగుతుంటే బాధనిపిస్తోంది: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌/చండూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పదవులన్నీ ఖాళీగా ఉన్నాయని, మంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి అధిష్ఠానానికి ఉత్తరం రాయడంతో విస్తరణ జాప్యం అవుతోందన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరైన ఆయన మాట్లాడారు. కొందరు నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, జానారెడ్డి తన సొంత ఉమ్మడి నల్లగొండ జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు మంత్రి పదవులను ఇవ్వాలని అనడం విచిత్రంగా ఉందన్నారు. తాను మంత్రి పదవి కోసం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, పైరవీకారులను పక్కన పెట్టాలని కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఏ మంత్రి గెలిపించారని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చాలామంది మంత్రులను రాష్ట్రంలోని పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా పెట్టిందని, భువనగిరి పార్లమెంట్‌కు మాత్రం మంత్రి ఇన్‌చార్జిగా రాలేదని, ఒక ఎమ్మెల్యేను పార్టీ ఇన్‌చార్జిగా పెట్టిందని పేర్కొన్నారు. తనకు మంచి పేరు, గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్‌చార్జిగా పెట్టారని ప్రశ్నించారు. గెలిపించే సత్తా ఉందనే కదా తనకు బాధ్యత అప్పగించారని చెప్పారు.


చామలను 2.25 లక్షల మెజార్టీతో గెలిపించా

‘ఇచ్చిన మాటను నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్‌చార్జిగా పెడితే అభ్యర్థిని గెలిపించినం కదా.. ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, మెదక్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడికి పోయిండ్రు’? అని రాజగోపాల్‌ రెడ్డి నిలదీశారు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని 2.25 లక్షల మెజార్టీతో గెలిపించానని తెలిపారు. ప్రతిపక్షాలతో కొట్లాడే శక్తి, సామర్థ్యం ఉన్న వారికి మంత్రి పదవి ఇవ్వడం సముచితమని, తనకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికలకు ముందు పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని తెలిపారు. అధిస్ఠానం మంత్రి పదవి ఇస్తానంటుంటే కొందరికి చెమటలు పడుతున్నాయన్నారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయడం లేదని, రాజగోపాల్‌రెడ్డి అర్హుడనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి కానీ.. ఏదో రిజర్వేషన్‌ కోటాలో కాదని, మాటిచ్చారని కాదని పేర్కొన్నారు. మంత్రి పదవి వస్తే నల్లగొండతో పాటు రాష్ట్రానికి, కాంగ్రె్‌సకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాడు.. మంచి పనులు చేస్తాడనే ఆలోచనతో అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను పదవి కోసం అడుక్కునే పరిస్థితిలో లేనని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్‌ ఎంపీల్లో తాను ఒకడినన్నారు. తన విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దారిన పోయే దానయ్యకు పదవిస్తే కొట్లాడతాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అనే వ్యక్తిని గద్దె దింపేవరకు నిద్రపోనని చెప్పిన తాను.. బీజేపీలో ఉన్నా సరే మళ్లీ వెనకడుగు వేసి కాంగ్రె్‌సలోకి వచ్చి గద్దె దింపానా లేదా అని అన్నారు.


మంత్రి పదవిపై అధిష్ఠానం హామీ : చామల

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రె్‌సను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సముచితమని అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాజగోపాల్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీ చామల అధిష్ఠానానికి చెప్పాలని కోరారు.


నా ఓపిక, సహనాన్ని పరీక్షించొద్దు

తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయగా, తాను తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కొట్లాడానని, తెలంగాణ కోసం కొట్లాడిన అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పా అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తనను చూసి కొందరు భయపడుతున్నారని, ప్రాణం పోయినా రాజగోపాల్‌ రెడ్డి తప్పు చేయడని స్పష్టం చేశారు. మునుగోడు నుంచి గతంలో ఎవరికీ మంత్రి పదవి రాలేదని, మంత్రి పదవి ఇస్తే వెనకబడిన ఈ ప్రాంతం మరింతగా అభివృద్ది చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, నల్లగొండ జిల్లాలో 11 మంది గెలిచినప్పుడు తనకెందుకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నా ఓపిక, సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి జిల్లాలోని సాగు, తాగు నీటి ప్రాజెక్టులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేయిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి అవిరళ కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 08:03 AM