KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
ABN , Publish Date - Apr 15 , 2025 | 06:02 AM
తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత పాలనను చూశాక.. ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ల శిక్ష అన్నట్లుగా తయారైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం : కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత పాలనను చూశాక.. ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ల శిక్ష అన్నట్లుగా తయారైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాతలు రేవంత్‌రెడ్డి వంటి మోసపూరిత పాలనను చూసుంటే అప్పుడే రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఓట్ల కోసం మోసానికి పాల్పడిన కాంగ్రెస్ నేతలతో పాటు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంఽధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అసైన్డ్ భూములకు పట్టాలు, రూ.12 లక్షల దళితబంధు అన్నారు. విద్యాజ్యోతి పథకం కింద దళితులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఎక్కడకు పోయాయో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజా సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. గవర్నర్ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయంపై కూడా సుప్రీంకోర్టు తగిన తీర్పు ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జయంతి రోజు బ్యానర్ కట్టారని కామారెడ్డిలో దళితుడి బట్టలూడదీసి పోలీసులు ఈడ్చుకుపోవడం దారుణమని పేర్కొన్నారు. ఆ పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ఆటో సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేటీఆర్‌ను ఆయా సంఘాల ప్రతినిధులు కలిసి సభ కోసం రూ.26 వేల విరాళం చెక్కును అందజేశారు. ఆ చెక్కును వారికే తిరిగిచ్చిన కేటీఆర్.. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అందజేయాలని సూచించారు.