E Car Race Scam: కేటీఆర్ ఇంటికా? జైలుకా?
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:08 AM
E Car Race Scam: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళతారా? లేక అరెస్టవుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
నేడు ఏసీబీ విచారణకు.. అర్వింద్ కుమార్ విచారణ పూర్తవడంతో కేటీఆర్‌కు కీలక ప్రశ్నలు సంధించే అవకాశం!
పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఏసీబీ భారీ బందోబస్తు.. ఏసీబీ కార్యాలయం రోడ్డు మూసివేత
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళతారా? లేక అరెస్టవుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే కేసులో నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను బుధవారం ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. పలు కీలక అంశాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో కేటీఆర్ విచారణకు వచ్చిన తర్వాత ఆయన్ను ఏయే అంశాలపై ప్రశ్నించాలి, ఆయన జవాబులకు కౌంటర్‌గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయమై ఏసీబీ పక్కా వ్యూహన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్, పురపాలక శాఖ మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం సమయంలో జరిగిన కమ్యూనికేషన్ వివరాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించారు. ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థకు చెందిన చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు నాటి మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
‘స్పాన్సరర్ కంపెనీ ఎందుకు తప్పుకొంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు? హెచ్‌ఎండీఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం మీకు తెలియదా?’ అనే కోణంలో కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన మీరు విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు? నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు? అన్న విషయాలపై అర్విందకుమార్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. విచారణకు సహకరించకపోతే కేటీఆర్ అరెస్టు తప్పదని సీనియర్ పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్టు చేయాల్సి వస్తే బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు అలెర్ట్ వచ్చినట్లు తెలిసింది.
భారీ బందోబస్తు..
కేటీఆర్ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఏసీబీ ఆఫీసు వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో అటువైపు వెళ్లే రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేస్తున్నారు. బీఆర్‌ఎస్ కీలక నేతలు కొందరిని గృహ నిర్బంధంలో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.