లింగమయ్యా.. వస్తున్నామంటూ భక్తుల సాహస యాత్ర
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:37 PM
దట్టమైన అభయా రణ్యంలో రెండు కొండల నడుమ 1000అడుగుల లోతులో కొండ గుహలో ఉన్న మహిమాన్విత లింగమయ్యస్వామి చైత్ర పౌర్ణమి రోజున దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

- పౌర్ణమి రోజు దర్శనానికి భారీగా తరలివచ్చారు..
- కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- తీవ్ర ట్రాఫిక్ సమస్య
- స్వామి దర్శనం కోసం 6 నుంచి 8 గంటల సమయం
అచ్చంపేట, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): దట్టమైన అభయా రణ్యంలో రెండు కొండల నడుమ 1000అడుగుల లోతులో కొండ గుహలో ఉన్న మహిమాన్విత లింగమయ్యస్వామి చైత్ర పౌర్ణమి రోజున దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. శుక్రవారం రాత్రి తెల్లవారుజామునుంచి శని వారం రాత్రి వరకు పౌర్ణమి ఘడియలు ఉండటంతో ఆ సమ యంలో స్వామిని దర్శించుకోవాలన్న తప్పనతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రనుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో నల్లమల అ భయారణ్యం భక్తజన సంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో స్వామి దర్శనం కోసం కిలో మీటర్లమేర భక్తులు వేచిచూడాల్సి న పరిస్థితి. లింగమయ్య దర్శనం కోసం 6నుంచి 8గంటల సమయం పట్టింది. సలేశ్వర జాతర చరిత్రలో ఈ ఏడాది వచ్చిన భక్తులు ఎప్పుడూ రాలేదని నిర్వాహకులు తెలిపారు. పరహాబాద్ నుంచి 18కిలో మీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పెంట వరకు కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడం తో భక్తులు కాలినడకన స్వామి దర్శనం కోసం రావాల్సివస్తుం ది. భక్తుల ఆకలిదప్పికలు తీర్చేందుకు మోకాళ్లకుర్వ సమీపం లో మణికంఠ, కృష్ణసేవా సమితి, గాజుల అంబయ్య, శామల ట్రస్ట్ ,శ్రీనివాస చార్టబుల్ ట్రస్ట్, గంగపుత్ర సంఘం, తదితర స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పండ్లు, ఫలహారాలతో పాటు రాగిజావ, మజ్జిగ, అన్నప్రసాదాలను అందజేశారు.
బండరాళ్లే భక్తుల పట్టుపాన్పులు
స్వామి దర్శనం కోసం కొండ కోనలు దిగుతూ ఎక్కుతూ బండరాళ్ల నడుమ అతికష్టం మీద వస్తున్నాం లింగమయ్య అంటూ ఊతకర్ర చేతబట్టి భక్తులు సాహసయాత్రను సాగించారు. మార్గ మధ్యంలో అలసిపోయిన భక్తులు బండరాళ్ల మధ్యనే ఆదమరిచి నిద్రిస్తూ సేదతీరుతూ... మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
మీడియా, సోషల్ మీడియా విస్తృత ప్రచారం
సలేశ్వర ఉత్సవాల గురించి మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో దక్షిణ అమర్‌నాథ్ యాత్రగా పిలువబడుతున్న సలేశ్వర లింగమయ్య యాత్రకు భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నల్లమల రహదారుల వెంట జనజాతర నెలకొన్నది. వాహనాలు బారులు తీరాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 300మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యాత్రలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తల్తెతకుండా వైద్యబృందాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
స్వామి దర్శనం కోసం కష్టమైనా ఇష్టంగా వెళుతున్నాం
- ప్రియదర్శిని మహబూబ్‌నగర్
నల్లమల అడవులలో వెలసిన సలేశ్వరుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకం. స్వామి దర్శనం కోసం ఎంతటి కష్టమైనా ఇష్టంగా వెళుతున్నాం. ఈ ఏడాది భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది.
సలేశ్వర క్షేత్రం మొదటిసారి చూస్తున్నాం
- అశోక్, ఎడివెళ్లి గ్రామం, కర్ణాటక
మాది కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ సమీపంలోని ఎడివెళ్లి గ్రామం సలేశ్వర క్షేత్రం గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాం. మొదటిసారిగా స్వామి దర్శనం కోసం వచ్చాం. అడవి ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటే ఎంతో ఉత్తేజం ఉంది. స్వామి దర్శనం బాగానే అయింది. ఇక్కడి నుంచి ప్రతిసారి రావాలనుకుంటున్నాం.