పల్లెకు రాని ఆర్టీసీ బస్సులు
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:08 PM
పేద మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణం కొందరికే మేలు జరగడంతో పల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు.

- దండుకుంటున్న ఆటో డ్రైవర్లు
నవాబ్‌పేట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : పేద మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణం కొందరికే మేలు జరగడంతో పల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద మండలమైన నవాబ్‌పేటకు ఆర్టీసీ సేవలు అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. విలీన గ్రామాలను కలుపుకుంటే సుమారు 250 పైగా తండాలు, గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ మండల వాసులు నిత్యం వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్, షాద్‌నగర్, జడ్చర్ల, రాజాపూర్, మహభూబ్‌నగర్, పరిగి, వికారాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కొత్తపల్లి, పోమాల, కారుకొండ కిష్టారం, సిద్దోటం, తీగలపల్లి, కొండాపూర్, లింగంపల్లి, గాలిగూడెం, కారూర్, ఇప్పటూర్, కూచూర్, ఖానాపూర్ గ్రామాల మీదుగా నిత్యం ఆర్టీసీ బస్సులు నడిచేవి. దీంతో వివిద ప్రాంతాలకు ప్రయాణం సాఫీగా సాగేది. కరోనా మహ్మమారి పేరుతో అధికారులు ఆయా గ్రామాలకు బస్సులు రద్దు చేయడంతో వివిధ గ్రామాల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆటో డ్రైవర్లు ఇష్టారీతిలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు చేయడంతో.. తమ గ్రామాలకు బస్సులు వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కారుకొండ కిష్టారం, నవాబ్‌పేట, కారూర్, మరికల్, కొత్తపల్లి, చౌడాపూర్, లింగంపల్లి, పోమాల, కొండాపూర్ గ్రామాలకు బస్సులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మంత్రి హమీ ఉత్తిదేనా..
గతేడాది నవాబ్‌పేట మండలం కొల్లూర్ పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొల్లూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు భూపాల్‌రెడ్డి, దేపల్లి వెంకటేష్‌గౌడ్, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మండలంలోని వివిధ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి వెంటనే ఆయా గ్రామాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించగా.. నేటికి అధికారులు బస్సులు నడపకపోవడం విడ్డూరం. పల్లెలకు ఉచిత బస్సులు నడపాలని ఎవరైనా మహబూబ్‌నగర్ ఆర్టీసీ అధికారులను కోరితే చూద్దాం.. లే అంటూ సమాధానాలు ఇస్తున్నారు.