Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ సర్కారు ఉన్నా..ఆ భూమిని స్వాధీనం చేసుకునేది
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:06 AM
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని, హెచ్‌సీయూకి సంబంధించినదేమీ కాదని స్పష్టం చేశారు. ఆయన, కేటీఆర్‌పై భూమి వివాదం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అప్పటి నుంచి ఇప్పటికీ అది ప్రభుత్వ భూమే:మహేశ్‌గౌడ్
అంగుళం భూమిని కూడా సర్కారు తీసుకోలేదు:చనగాని
హెచ్‌సీయూ భూములపై రాజకీయ కుట్ర: చామల
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ఆనాటి నుంచీ ప్రభుత్వానిదేనని, ఇప్పుడు బీఆర్‌ఎస్ సర్కారులో ఉన్నా.. ఆ భూమిని స్వాధీనం చేసుకునేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆ భూమి హెచ్‌సీయూది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా గతంలోనే హెచ్‌సీయూకి 397 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లుగా కొనసాగిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల దోస్తీ.. హెచ్‌సీయూ భూముల విషయంలో మరోమారు బయటపడిందన్నారు. విద్యార్థులకు కూడా ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని తెలుసునని, అయితే.. వారిని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఈ భూమి ఉన్న సర్వే నంబర్ 25లోనే కేటీఆర్ ఓ 50 ఎకరాల భూపంచాయితీని సెటిల్ చేశారు. ఆయన బినామీ అయిన మైహోం రామేశ్వర్‌రావుకు ఆ భూమిని బదిలీ చేయించారు. మైహోం సంస్థ అక్కడ విహంగ పేరుతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించింది. అప్పటి ప్రభుత్వం ఆ భవనాలకు 100 అడుగుల రోడ్లను వేయించింది. అప్పట్లో ఆ ప్రాంతంలో నెమళ్లు, జింకలు తిరుగుతున్న ఆనవాళ్లు, పచ్చదనం, చెట్లు కేటీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కనిపించలేదా? అప్పట్లో పర్యావరణ అంశం గుర్తుకు రాలేదా??’’ అని నిలదీశారు. హెచ్‌సీయూకు సంబంధించిన అంగుళం భూమి కూడా ప్రభుత్వం తీసుకోదని, ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో 2000 ఎకరాలను ధారదత్తం చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ భూములను కూడా బెదిరించి కబ్జాలకు గురి చేశారని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే దక్కాలని గతంలో వైఎ్‌సతో సహా.. సీఎంలుగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్ కూడా ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాలని న్యాయస్థానాల్లో పోరాటం చేశారని వివరించారు.