Share News

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి స్పెషల్.. మామిడికాయతో కమ్మటి పులిహోర చేసుకోండిలా..

ABN , Publish Date - Apr 05 , 2025 | 05:26 PM

Mango Pulihora Recipe: మండే ఎండలతో పాటే రుచికరమైన మామిడికాయలను వెంటబెట్టుకొస్తుంది వేసవి కాలం. చైత్రమాసం తొలినాళ్లలో వచ్చే శ్రీ రామనవమి పర్వదినాన మామిడికాయలతో పులిహోర చేసుకోవడం హిందూ సంప్రదాయం. ఈ రుచికరమైన వంటకంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి, కమ్మటి మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసా..

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి స్పెషల్.. మామిడికాయతో కమ్మటి పులిహోర చేసుకోండిలా..
Mango Pulihora Recipe

How to Make Pulihora Mith Mango: శ్రీ రామనవమి పండుగ వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున వస్తుంది. సరిగ్గా మామిడికాయలు ఇదే సీజన్‌లో వస్తాయి. పచ్చి మామిడికాయలు అందుబాటులో ఉండటం వల్ల వీటిని ఉపయోగించి ఈ రోజున రుచికరమైన పులిహోర తయారు చేస్తారు. ఈ వంటకాన్ని శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పంచుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మామిడికాయ పులిహోర చేయడం ఒక సంప్రదాయంగా మారింది. కమ్మటి ఘుమఘుమలాడే రుచికరమైన పులిహోర తయారీ విధానం ఏంటో తెలుసుకోండి.


కావలసిన పదార్థాలు :

  • అన్నం - 2 కప్పులు (ఉడికించి చల్లార్చినది)

  • పచ్చి మామిడికాయ - 1 (తురిమినది, సుమారు 1 కప్పు)

  • నూనె - 3 టేబుల్ స్పూన్లు

  • వేరుశనగ గింజలు - 2 టేబుల్ స్పూన్లు

  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్లు

  • మినపప్పు - 1 టేబుల్ స్పూన్

  • ఆవాలు - 1 టీస్పూన్

  • ఎండుమిర్చి - 2-3 (చిన్న ముక్కలుగా విరిచినవి)

  • పచ్చిమిర్చి - 2 (తరిగినవి)

  • కరివేపాకు - 10-12 ఆకులు

  • ఇంగువ - చిటికెడు

  • పసుపు - 1/2 టీస్పూన్

  • ఉప్పు - రుచికి సరిపడా

  • కొత్తిమీర - అలంకరణకు


తయారీ విధానం:

ముందు అన్నాన్ని కొంచెం పొడిగా వండుకుని ఒక గిన్నెలోకి తీసి చల్లారనివ్వండి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గింజలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొన్ని క్షణాలు వేగనిచ్చి.. తురిమిన పచ్చి మామిడికాయ, పసుపు, ఉప్పు వేసి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. మామిడి తురుము మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చిన అన్నంలో వేసి జాగ్రత్తగా కలపండి. చివరగా అన్నంపై కొత్తిమీర అలకరించి వేడిగా సర్వ్ చేయండి.


మామిడికాయ పులిహోర ఆరోగ్య ప్రయోజనాలు :

శ్రీరామనవమి సందర్భంగా ఇళ్లల్లో వండుకునే మామిడికాయ పులిహోర కేవలం రుచికరమైన వంటకమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి మామిడికాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పచ్చి మామిడిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వసంత కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేసి మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది. ఇందులోని అమైలేస్ ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసి జీర్ణ శక్తిని పెంచుతాయి. పచ్చి మామిడిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. ఈ వంటకంలో వాడే వేరుశనగ గింజలు, పప్పులు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. పసుపులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని తెలిసిందే. అందుకే ఈ శ్రీరామనవమి నాడు మామిడికాయ పులిహోరతో సంప్రదాయాన్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోండి.


Read Also: Summer Recipe: కేరళ స్టైల్లో పనస తొనల హల్వా.. ఎప్పుడైనా తిన్నారా.. సమ్మర్‌లో చాలా మంచిది..

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున చేసుకోవాల్సిన స్పెషల్ ప్రసాదాలు.. రెసిపీలు..

Tomato Powder: టమాటా పొడి ఇలా తయారుచేసుకోండి.. ఏ

Updated Date - Apr 05 , 2025 | 07:12 PM