Share News

Mahesh Kumar Goud: తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:37 AM

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షను నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా బీజేపీపై యద్దం ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు.

Mahesh Kumar Goud: తెలంగాణకు ఇచ్చింది  గాడిద గుడ్డు

  • కేంద్ర బడ్జెట్‌లో వివక్షను నిరసిస్తూ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నాం

  • పార్టీలకతీతంగా కదలాలి.. కిషన్‌రెడ్డి, బండి రాజీనామా చేయాలి

  • నిధులిచ్చే దాకా పోరాటం.. నేడు మోదీ, నిర్మల దిష్టిబొమ్మల దహనాలు

  • ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

కవాడిగూడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షను నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా బీజేపీపై యద్దం ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. కేంద్రం నిధులు ఇచ్చేంత వరకు శాంతియుత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటే.. కేంద్రం తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిందని విమర్శించారు. దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అనే తెలుగు గేయం వినిపించి తెలుగు నేల అభివృద్ధికి మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం, మంత్రి సీతక్క, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.


దాదాపు గంటకుపైగా ధర్నా కొనసాగగా, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు తెలంగాణ అభివృద్ధి పట్టదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ ఉంటే వారిద్దరూ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి దిశగా కాకుండా రాజకీయ ప్రయోజనాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఢిల్లీ, బీహార్‌ ఎన్నికల కోసమే బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమని అన్నారు. కొన్ని రాష్ట్రాలకే బడ్జెట్‌ కేటాయింపులు అందిస్తే.. వికసిత్‌ భారత్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో రూ.లక్ష కోట్లు వసూలు చేస్తున్న కేంద్రం.. కనీసం రూ.40వేల కోట్లు కూడా తిరిగి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలపై విమర్శలు గుప్పించే బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు... ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.


చివరకు మొండి చేయే చూపారు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విద్వేషం చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బీజేపీ ఎంపీలలో తెలంగాణ డీఎన్‌ఏ ఉంటే ఇప్పటికైనా గొంతు ఎత్తాలని డిమాండ్‌ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, నిధుల కేటాయింపులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రులు ప్రధాని వద్దకు ఎన్ని సార్లు వెళ్లినా... చివరకు మొండిచేయే చూపారని ధ్వజమెత్తారు. ఇది బీజేపీ స్వార్థ బడ్జెట్‌ అని ఆరోపించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆమె సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణకు బడ్జెట్‌లో ప్రతిసారి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. నిధుల కోసం రాజకీయాలకు అతీతకంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఈ విషయమై ఢిల్లీలోనూ ధర్నా నిర్వహించి.. కేంద్రాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:37 AM

News Hub