Share News

చల్లగా దోపిడి

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:44 PM

మండుతున్న ఎండల్లో మద్యం ప్రియులు చల్లని బీర్ల ను లాగించేస్తుంటారు. దీంతో ఫిబ్రవరి చివర నుంచి జూన్‌ మొదటి వారం వరకు బీర్ల విక్రయాలు భారీగా ఉంటాయి. ఈ విక్రయాల్లో బార్లు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయనే ఆరోపణ లు ఉన్నాయి. తక్కువ విక్రయాలు ఉన్న బార్ల నుంచి ఎక్కువ అమ్మకాలు సాగే బార్లకు బీర్లు తరలిస్తున్నట్టు సమాచారం.

చల్లగా దోపిడి

బార్ల నుంచి పక్కదోవ పడుతున్న బీర్లు

లక్ష్యం చేరని బార్ల నుంచి ఇతర బార్లకు

రెండు నెలల్లో రూ.3కోట్ల మేర అక్రమ కొనుగోళ్లు

సుమారు రూ.39లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి

కోదాడ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మండుతున్న ఎండల్లో మద్యం ప్రియులు చల్లని బీర్ల ను లాగించేస్తుంటారు. దీంతో ఫిబ్రవరి చివర నుంచి జూన్‌ మొదటి వారం వరకు బీర్ల విక్రయాలు భారీగా ఉంటాయి. ఈ విక్రయాల్లో బార్లు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయనే ఆరోపణ లు ఉన్నాయి. తక్కువ విక్రయాలు ఉన్న బార్ల నుంచి ఎక్కువ అమ్మకాలు సాగే బార్లకు బీర్లు తరలిస్తున్నట్టు సమాచారం. వేసవి నేపథ్యంలో బీర్ల విక్రయాలు పెరగడం, ఎక్సైజ్‌శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉండటంతో ఈ అక్రమాల తంతు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌, మే నెలలో ఈ వ్యవహారం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో 54 బార్లు

ఉమ్మడి జిల్లాలో 54 బార్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 22, యాదాద్రిలో 12, సూర్యాపేటలో 20 ఉన్నాయి. వీటిలో సుమారు 10 బార్ల లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. బార్ల లైసెన్స్‌ ఫీజు రూ.42లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి పొందిన వారు ఏడాదికి ఏడురెట్లు అంటే రూ.2.94కోట్ల వరకు మద్యం విక్రయాలు చేయవచ్చు. అం దుకు 17శాతం చొప్పున ప్రభుత్వం కమీషన్‌ ఇస్తుంది. అంతకు మించి విక్రయిస్తే అదనం గా విక్రయించిన దానికి 4శాతం కమీషన్‌ ఇస్తుంది. మిగిలిన 13శాతం ప్రివిలైజ్‌ పన్ను రూపంలో ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుంది. అదే విధంగా ఒక్కో వైన్‌షాపుకు లైసెన్స్‌ ఫీజు రూ.60లక్షలుగా నిర్ణయించింది. లైసెన్స్‌ పొందిన నిర్వాహకులు సంవత్సరంలో 10రెట్లు అంటే రూ.6కోట్ల వ్యాపారం నిర్వహించవచ్చు. అందుకు ప్రభుత్వం 17శాతం కమీషన్‌ చెల్లిస్తుంది. అంతకు మించి మద్యం విక్రయాలు చేస్తే అదనంగా విక్రయించిన దానికి 6శాతం కమీషన్‌ చెల్లించి, మిగిలిన 11శాతాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుంది. అదనంగా విక్రయించిన మద్యానికి 17శాతం బదులు, తక్కువగా కమీషన్‌ వస్తుండటంతో తక్కువ వ్యాపారం ఉన్న వారు అధికంగా విక్రయాలు ఉండగే వారికి బీర్ల సరఫరా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే 17శాతం కమీషన్‌ను తలా ఇంత పంచుకుంటున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి ఇలా

ఉమ్మడి జిల్లాలోని మొత్తం 54 బార్లు ఉండగా వాటిలో సుమారు 10 బార్లలో విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇవి లక్ష్యం మేరకు మద్యం విక్రయాలు చేయలేకపోతున్నాయి. దీంతో లక్ష్యం పూర్తయిన బార్లు, వెన్స్‌ నిర్వాహకులు, లక్ష్యం పూర్తికాని వారి నుంచి బీర్లు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి 17శాతం చొప్పున కమీషన్‌ వస్తోంది. ఇందులో 8.5శాతం చొప్పున కమీషన్‌ను నిర్వాహకులు పంచుకుంటున్నారు. ఆ చొప్పున 10బార్ల నుంచి రోజుకు రూ.50వేల బీర్ల విక్రయాలతో, నెలకు రూ.1.50కోట్ల చొప్పున, రెండు నెలల్లో అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.3కోట్ల మద్యం అధికంగా విక్రయించే చేసేస్థాయికి దుకాణాలు వెళ్లినట్లు వినికిడి. దీంతో 13శాతం చొప్పున ప్రభుత్వానికి రావాల్సిన రూ.39లక్షల ఆదాయానికి గండి పడుతోంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

లెబుల్స్‌ లేకపోవడంతో..

ఐఎంఎల్‌ మద్యానికి లెబుల్స్‌ ఉంటాయి. బీర్లకు అటువంటి లెబుల్స్‌ ఉండవు. దీంతో బీర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్లాయనే విషయం తెలియదు. బీర్లపై అధికారులు తనిఖీలు నిర్వహించినా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దీంతో బీర్ల విక్రయాలు తక్కువ ఉన్న దుకాణాల నుంచి అధిక విక్రయాలు ఉన్న దుకాణాలకు తరలుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఎక్సైజ్‌శాక అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే కొంత వరకైనా ఈ అక్రమానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:44 PM