ఆటాడుకుందాం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:15 AM
శారీరక, మానసిక వికాసంలో ఆటలకు ఉన్న ప్రాధాన్యం ఎంతో గొప్పది. పూర్వీకుల నుంచి ఆటల పట్ల ఉన్న ఆ ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది.

శారీరక ఆరోగ్యం, వినోదమే ప్రధానంగా అప్పటి ఆటలు
పెరిగిన సాంకేతికతతో మరుగునపడ్డ ఆటలు
డిజిటల్ గేమ్స్‌తో కనుమరుగు
శారీరక, మానసిక వికాసంలో ఆటలకు ఉన్న ప్రాధాన్యం ఎంతో గొప్పది. పూర్వీకుల నుంచి ఆటల పట్ల ఉన్న ఆ ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది. రేడియో, టెలివిజన్ వంటి వినోద సాధనాలు రాకముందు వినోదం, మానసిక చురుకుదనం, ఐఖ్యమత్యం, పట్టుదల, స్నేహ సంబంధాలతో పాటు ఆరోగ్యం, ఆనందానికి ఆటలు ప్రేరకాలుగా ఉండేవి. అందుబాటులో ఉన్న వస్తువులు, పరికరాలతో ఆట వస్తువులను తయారుచేసుకుని ఆడటం పూర్వపు రోజుల్లో కనిపించేవి. గ్రామాల్లో తీరిక వేళల్లో , వెన్నెల రాత్రుల్లో లింగబేధం లేకుండా, వయస్సుల తారతమ్యం పాటించకుండా ఆడేవారు. ఆటలు వారి జీవన ప్రయాణంలో భాగస్వామ్యమై ఉండేవి. అంతటి ప్రాధాన్యం ఉన్న అప్పటి ఆటల్లో కొన్ని....
- (ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్)
రోజురోజుకూ సాంకేతికపరమైన వస్తువులపై మక్కువ చూపిస్తుండటంతో ఆటలపై పిల్లలో అనాసక్తి మొదలైంది. దీంతో గత కాలపు ఆటలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. ప్రధానంగా అండ్రాయిడ్, గేమింగ్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు పిల్లల చేతుల్లోకి రావడంతో శారీరక శ్రమకొర్చే ఆటలపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో శరీరానికి శ్రమ కరువై వారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా చిన్నవయస్సులోనే కంటి సమస్య, పొట్టరావడం, మానసికఒత్తిడితో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు అందరూకలిసి జట్టుగా ఆటలు ఆడకపోవడంతో పిల్లల మధ్య స్నేహ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా తల్లిదండ్రులు స్పందించి గత ఆటల సంస్కృతీ, సంప్రదాయాలపై వారికి ఆసక్తిని కలిగిచేలా, పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు పరిమితం కాకుండా అందరితో కలిసి ఆడుకునేలా ప్రత్యేక దృష్టి సారించి ఆనాటి ఆటలు కనుమరుగు కాకుండా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. గతంలో పాఠశాలలకు విద్యార్థులు వెళ్లాలంటే ఇంటి నుంచి కిలోమీటర్ నుంచి సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లేవారు. దీంతో నడక చిన్నతనంలో అలవాటైపోవడంతో ఇప్పుడు వారు ఎంతో ఆరోగ్యం ఉన్నారు. అంతేకాకుండా పాఠశాల మైదానంలో విద్యార్థులు అందరూ కలిసి రకరకాలు ఆటలు ఆటడంతో వారిలో స్నేహబంధాలు, పట్టుదల, ఐక్యమత్యం, మానసిక ప్రశాంత ఏర్పడి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉన్నారంటే అన్నింటికి కారణం ఆటలు. ప్రభుత్వాలు సైతం విద్యార్థులకు చదువుతో పాటుగా ఆటలపై ఆవగహన కల్పించి ప్రత్యేక దృష్టి సారించి ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా పీఈటీలను నియమించి చక్కదిద్దాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
గతకాలపు ఆటలు
టైరాట, వీరివీరి గుమ్మడిపండు, కోతికొమ్మచ్చి, అల్లం-దుర్గం, బొంగారాల, కైలాసం, అష్టాచమ్మ, దోపుడుపుల్ల, నాలుగు రాళ్లు, వంగుడు దుంకుడు , రేసాట, బొమ్మరిల్లు, ముక్కు గిచ్చుడు, దస్తే బిస్తడి , చెల్లెల బండి, గచ్చకాయలు, ఉప్పు బెరలాట, కుంటరా గాడిద కుంటూ , చిర్రగోనే, కబడ్డీ, సీసం గోళీకాయల, వనగుంటలు, పుంజీతం, చెస్, క్యారంబోర్డు
గచ్చకాయలు, ముక్కు గిచ్చుడు ఇష్టం
చిన్నప్పుడు గ్రామంలో సాయంకాలం స్నేహితులు అందరం కలిసి గచ్చకాయల ఆట, అష్టా చెమ్మ, దోపుడు పుల్ల, ఉప్పు బెరడు, చిక్కుడు బిల్ల, బొమ్మరిల్లు, సెల్లెల బండి ఆట ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. తోటి స్నేహితులు ఎవరైనా గొడవపడితే ముక్కు గిచ్చుడు ఆట ఆడితే వారిని కోపంతో గట్టిగా గిచ్చేవాళ్లం. వేసవిలో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అమ్మానాన్న కైలాసం ఆట ఆడించేవారు. ఎక్కువగా పాపాలు ఎవరు చేస్తే వారిని అనకొండ పాము మింగుతుందని అనడంతో ఎంతో భయపడే వాళ్లం. కైలాసం ఆట అంటే ఎంతో ఇష్టం.
- చంద్రగాని అయిలమ్మ, వంగపల్లి
పిల్లలను స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి
చిన్ననాటి నుంచే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వకుండా వారిని దూరంగా ఉంచాలి. ఫోన్లు ఇవ్వడంతో ఇతర ఆటలపై ఆసక్తి ఉండకుండా పోవడమే కాకుండా వారిలో అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు ఎక్కువగా తలత్తే ప్రమాదం ఉంది. వాటిని నివారించి అలనాటి ఆటలను ఆడించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, అందరిపై ఉంది.
- పేరబోయిన రేణుక, కొత్తగుండ్లపల్లి
ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించాలి
ప్రభుత్వాలు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల్లో దాగియున్న నైపుణ్యాన్ని వెలికితీయాలి. క్రీడాకారులు మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది.
- పూల నాగయ్య, రిటైర్డ్ పీఈటీ