‘రాజ’కీయ దుమారం
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:03 AM
మాజీ మంత్రి, సీనియర్‌నేత జానారెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి.

జానారెడ్డి టార్గెట్‌గా రాజగోపాల్‌రెడ్డి కామెంట్లు
జానా లేఖతోనే మంత్రిపదవి చేజారిందనే భావనలో ఎమ్మెల్యే
అధిష్ఠానం హామీ ఇచ్చినా నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపణ
మూడోమంత్రి పదవిపై జిల్లాలో రగులుతున్న రాజకీయం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): మాజీ మంత్రి, సీనియర్‌నేత జానారెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. తనకు మంత్రిపదవి రాకపోవడానికి జానారెడ్డి రాసిన లేఖ కారణమని భావిస్తోన్న రాజగోపాల్, మహాభారతంలో ధర్మరాజులాగా వ్యవహరించాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక దాదాపు 16నెలల తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ లో అసంతృప్తి బహిర్గతమైంది. ఈ పరిస్థితి టీకప్పులో తుఫానులా సద్దుమణుగుతుందా..? లేక అసమ్మతి ప్రజ్వరిల్లి వర్గపోరుకు దారి తీస్తుందా..? అని రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చసాగుతోంది. తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిన మాట వాస్తవమని, మంత్రి పదవి ఖరారయ్యే సమయంలో జానారెడ్డి లేఖతో మళ్లీ మొదటికొచ్చిందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తాను ఇన్నిరోజులూ ఆగానని, ఇక తాను కూడా మంత్రిపదవి కోసం అడుగుతానని, వెనకబడిన ప్రాంత అభివృద్ధికోసం మంత్రిపదవి కావాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలో ముగ్గురికి ఇచ్చినప్పుడు..
ఖమ్మంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు, నల్లగొండలో 11 మందిని గెలిపిస్తే ఎందుకివ్వర ని రాజగోపాల్‌రెడ్డి నిలదీయడం రాజకీయవర్గాల్లో తీవ్రచర్చకు దారితీసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఒక్కో సీటుకు ఒక్కో సీటు కు ఒక్కో మంత్రి ఇన్‌చార్జిగా ఉన్నారని, ఎక్కడాలేని విధంగా భువనగిరిలోనే ఒక ఎమ్మెల్యేనైన తాను ఇన్‌చార్జిగా బాధ్యతలిచ్చారంటే, తన సమర్థతపైనా, అభ్యర్థిని గెలిపిస్తాననే నమ్మకం ఉండబట్టే ఇచ్చారని, ఆ ఎన్నికలో అన్ని నియోజకవర్గాలు తిరిగి అభ్యర్థిని గెలిపించడమే తన సమర్థతకు, పనితీరుకు నిదర్శనమని రాజగోపాల్‌రెడ్డి పేర్కొంటున్నారు. మంత్రులు ఇన్‌చార్జిలుగా ఉన్న మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో ఎందుకు ఓడిపోయారని, ఈ మంత్రులంతా ఎటు పోయారని ప్రశ్నించడం ద్వారా లోక్‌సభ ఎన్నికలపై చర్చను రాజేసినట్లయింది. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఎలా ఇస్తారనే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజగోపాల్‌రెడ్డి ఇస్తే తప్పేంటని, సమర్థతను పరిశీలించాలే తప్ప ఇలాంటి సమీకరణాలు కాదని, తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, ప్రజలకు మేలు చేస్తానని పేర్కొన్నారు.
అసమ్మతికి బీజం పడ్డట్లేనా...!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 16 నెలల తర్వాత మొదటిసారిగా రాజగోపాల్‌రెడ్డి రూపంలో అసమ్మతి స్వరం వెలువడింది. తనకు అధిష్ఠానం ఇస్తానన్న మంత్రిపదవికి దుర్మార్గంగా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలో జరిగిన తెరవెనక మంత్రాంగాన్ని తెలియజేస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, అధిష్ఠానం సుముఖంగా ఉన్నా జిల్లా నేతలే అడ్డుపడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీలో అంతర్గత విబేధాలున్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. నేరు గా జానారెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి తన సందేశాన్ని నేరుగా ఇచ్చినట్లవుతుందనే వ్యూహంలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డి జానాపై వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. కొందరు నాయకులు తనకు మంత్రిపదవి రాకుండా దుర్మార్గంగా అడ్డుకుంటున్నారని పేర్కొన్న రాజగోపాల్‌రెడ్డి ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. కానీ జానారెడ్డిలాంటి నేత సైతం ధర్మరాజు వలె వ్యవహరించకుండా ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారంటూ ఆక్షేపించడం ఆయన ద్వారా అధిష్ఠానంపై, పార్టీ ముఖ్యనేతలపై ఒత్తిడి తెచ్చే వ్యూహమేననే చర్చ సాగుతోంది.
లంబాడ ఎమ్మెల్యేలంతా ఖర్గేకు లేఖ
మంత్రిపదవి విషయంలో రాజగోపాల్‌రెడ్డి ఆదివారం తన గళాన్ని విప్పగా, పదవి ఆశిస్తోన్న ఉమ్మడి జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే బాలూనాయక్ (దేవరకొండ) సైతం ఇంతకుమునుపే అసెంబ్లీ లాబీల్లో తమ లంబాడ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే సహించబోమని పేర్కొన్న విషయం తెలిసిందే. లంబాడ సామాజికవర్గ ఎమ్మెల్యేలంతా కలిసి మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ అఽధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు లేఖ రాశారు. అనంతర పరిణామాల్లోనే రంగారెడ్డి, హైదరాబాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి లేఖ రాయడం, ఈ లేఖల ప్రభావానికి తోడు, ఒకే కుటుంబం, కులం, ఒకే జిల్లా తదితర కారణాలను చూపుతూ రాజగోపాల్‌రెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలకు ఆశాభంగం కలిగేలా అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి రూపంలో తొలి అసమ్మతి స్వరం వెల్లడయిందని, పదేళ్లపాటు అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకొని ఉండడంతోపాటు, గడచిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అవకాశాలు దక్కకపోయినా అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసినవారు, తమకు బలమైన పదవి వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నాయకులు ఇప్పటికే లోలోపల అసమ్మతితో రగిలిపోతున్నారు. పదవి రాదని తేలితే, పెద్దసంఖ్యలో ఉన్న ఈ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఎమ్మెల్యేలకు కంట్లో నలుసుల్లా మారడం ఖాయమని వీటన్నింటినీ అధిష్ఠానం ఎంత త్వరగా పరిష్కరిస్తే అంతమంచిదని, ఎంత జాప్యం చేస్తే అంత నష్టం జరుగుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.