Share News

మామిడికాయకు ధరల కోత

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:42 AM

భానుపురి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): మామిడి సాగు చేసిన రైతులను మండీ వ్యాపారులు ధరల కోతలు విధించి నడ్డివిరుస్తున్నారు. సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారు.

  మామిడికాయకు ధరల కోత

వ్యాపారులు సిండికేట్‌

పట్టించుకోని అధికారులు

భానుపురి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): మామిడి సాగు చేసిన రైతులను మండీ వ్యాపారులు ధరల కోతలు విధించి నడ్డివిరుస్తున్నారు. సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే డిమాండ్‌ లేదని సాకు చెబుతూ దోచుకుంటున్నారు. ఇతరరాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. రెండు రోజుల కిందటే మార్కెట్‌ ప్రారంభమైన మార్కెట్‌కు ఇబ్బడిముబ్బడిగా దిగుబడి వస్తోంది. వివిధ సాకులతో వ్యాపారులు ధరలను కోత విధిస్తున్నారు. అయినా ధరలపై వ్యాపారుల నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. మార్కెట్‌ ఫీజు వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 99శాతం మామిడి తోటలను కౌలుకు తీసుకుని రైతులు సాగు చేస్తున్నారు. తోట యజమానికి కౌలు, పూత దశ నుంచి కాతదశ వచ్చే వరకు మందులను పిచికారీచేయడం, కోతుల భారీ నుంచి, ఈదురు గాలుల నుంచి తప్పించుకుని మామిడి పంటను మార్కెట్లకు తీసుకువస్తే వ్యాపారులు సిండికేట్‌ అవుతున్నారు. ఈదురుగాలులు వస్తే చాలు వ్యాపారులు అమాంతంగా ధరలను తగ్గిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్‌రోడ్డులో మామిడికాయల మండీలు 9 నుంచి 12 వరకు ఉన్నాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కరువైంది.

ఒక్క రోజులో రూ.19 వేలు కోత

కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన రైతు బాలబోయిన సత్యనారాయణ స్థానికంగా ఉన్న మామిడితోటలోని 13.20 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. పంటను కాపాడుకోవడానికి నానాకష్టాలు పడ్డారు. తోటకు రూ.9 లక్షలు కౌలు చెల్లించాల్సి ఉండగా, వివిధ రకాల పిచికారీ మందులకు రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. పూత దశ నుంచి పంట చేతికందే వరకు ఏడుసార్లు మందులను పిచికారీ చేశాడు. పూత దశలో, ఆ తర్వాత నూక పడిపోకుండా, బటానీ గింజ, శనగగింజ, నిమ్మకాయ సైజు వచ్చే వరకు, మంచు కురిసిన సమయంలో, కాయలపై మంగు రాకుండా మందులను పిచికారీ చేశాడు.

సూర్యాపేటలో మార్కెట్‌లో కొనుగోళ్లు మంగళవారం ప్రారంభమైందని తెలిసి 2 టన్నుల మామిడికాయలు తీసుకువచ్చారు. కాగా టన్నుకు రూ.59 వేల ధర పలికింది. ధర మంచిగా వస్తుందన్న ఆశతో బుధవారం మరో టన్నున్నర పంటను తీసుకువచ్చాడు. కానీ ఈసారి వ్యాపారులు సిండికేట్‌గా మారి రూ.38 వేలకే పాటపడ్డారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన సత్యనారాయణను దబాయించారు. ఈ క్రమంలో కమీషన ఏజెంట్‌ కల్పించుకుని మరో రూ.2 వేల ధర పెంచి రూ.40 వేలకు పాడించాడు. దీంతో ఒక్కరోజు తేడాలో రూ.19 వేల ధర వ్యాపారులు కోత విధించారు. ఈదురుగాలులకు పడిపోయిన కాయ తెచ్చారని సాకు చెప్పడం వ్యాపారులకు, కమీషనదారులకు పరిపాటైంది. దీనికి తోడు హమాలీ ఖర్చు, గుమస్తాల మాములు, కమీషన, మార్కెట్‌ఫీజు పేరుతో స్లిప్‌లను ఇస్తున్నారు. రూ.100కు రూ.14 చొప్పున కటింగ్‌ చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

మంగు లేని కాయ తెచ్చా

మంగు లేని, దెబ్బతినని కాయ తీసుకు వస్తే రూ.38 వేల ధర వేశారు. ఈదురుగాలులకు కింద పడిన కాయ తెచ్చినట్లు వ్యాపారులు సాకు చెబుతూ ధరలో కోత విధిస్తున్నారు. ఒక్క రోజు తేడాతోనే రూ.19 వేలు కోత విధించారు.

బాలబోయిన సత్యనారాయణ, కౌలు రైతు

నిఘా పెడతాం

మామిడి మండీలపై నిఘా పెడతాం. పర్యవేక్షణ కోసం మార్కెట్‌ సిబ్బందిని కేటాయించాం. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ తగ్గినప్పుడు ఇక్కడ ధర తగ్గిస్తారు. కాయ బాగుంటే మంచి ధర ఇస్తారు.

సంతో్‌షకుమార్‌,సూర్యాపేట, మార్కెట్‌కార్యదర్శి

Updated Date - Apr 10 , 2025 | 12:42 AM