Dr. Rajkumari Bharosa: హెచ్‌ఎంపీవీ సోకితే ఇక్కడే నిర్ధారణ!
ABN, Publish Date - Jan 09 , 2025 | 03:48 AM
కరోనా వచ్చినప్పటి నుంచీ.. ‘వైరస్’ అనే మాట వినగానే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చైనాను వణికిస్తున్న ‘హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్)’ కేసులు మనదేశంలో కొన్ని వెలుగు చూసిన నేపథ్యంలో.. చాలా మంది భయపడుతున్నారు.
మన దగ్గరే మైక్రోబయాలజీ ల్యాబ్ ఉంది.. ఈ వైర్‌సతో అంత ప్రమాదం ఏమీ లేదు
సాధారణ జలుబులాంటిదే.. భయం వద్దు
ముందు జాగ్రత్తచర్యగా గాంధీ ఆస్పత్రిలో
ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేశాం
‘ఆంధ్రజ్యోతి’కి గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రత్యేక ఇంటర్వ్యూ
హైదరాబాద్ సిటీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వచ్చినప్పటి నుంచీ.. ‘వైరస్’ అనే మాట వినగానే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చైనాను వణికిస్తున్న ‘హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్)’ కేసులు మనదేశంలో కొన్ని వెలుగు చూసిన నేపథ్యంలో.. చాలా మంది భయపడుతున్నారు. కానీ.. ఆ వైరస్ గురించి భయపడాల్సిన పని లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి భరోసా ఇచ్చారు. ఆ వైరస్ బారిన పడినవారికి చికిత్స చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని.. నిర్ధారణ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
హెచ్‌ఎంపీవీ కేసులు పెరిగితే.. సమర్థంగా ఎదుర్కొవడానికి ఇక్కడ సన్నద్ధంగా ఉన్నారా?
ఆ వైరస్ గురించి పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. దాని బారిన పడినా.. సాధారణ వైరల్ ఫీవర్, ఫ్లూ తరహా లక్షణాలే ఉంటాయి. అది సాధారణ జలుబు లాంటింది. ఇలాంటి వైర్‌సలు అప్పడప్పుడూ వస్తూనే ఉంటాయి. గాంధీలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. సమర్థమైన చికిత్స అందించే ఏర్పాట్లున్నాయి.
ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఈ వైర్‌సకు ప్రత్యేక వార్డుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా 40 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. 20 మంది పెద్దలకు, మరో 20 పిల్లలకు పడకలు ఏర్పాటు చేశాం. అలాగే ఆస్పత్రిలో 600 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి, 450 వరకు వెంటిలేటర్లు, 40 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉంది.
పరీక్ష చేసి ఇక్కడే నిర్ధారిస్తారా?
గాంధీలో మైక్రోబయోలజీ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఏ వైరస్ వచ్చినా పరీక్ష చేసే సదుపాయం ఉంది. కొవిడ్ సమయంలో ఇక్కడే పరీక్షలు చేసి నిర్ధారించాం. ప్రస్తుతం ఎవరికైనా లక్షణాలు ఉండి, అనుమానం ఉంటే నమునాలు సేకరించి పరీక్ష చేస్తాం. తర్వాత పుణేలోని సెంట్రల్ ల్యాబ్‌కు పరిశీలనకు పంపిస్తాం. అక్కడ మరోసారి పరీక్షలు చేసిన తర్వాత ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటాం. పుణే నుంచి ఫలితాలు రావడానికి రెండు రోజులు పట్టొచ్చు. గాంధీలో ఉదయం పరీక్ష చేసి సాయంత్రానికి ఫలితాలు వెల్లడించే అవకాశముంది. కొవిడ్ సమయంలో ఇలాగే జరిగింది.
ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కేటాయించారా?
ఇప్పటివరకూ అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. కానీ.. ఆస్పత్రిలో కొవిడ్ సమయంలో సమర్థమైన చికిత్స అందించిన నిష్ణాతులైన వైద్యులున్నారు. జనరల్ సర్జన్స్, మెడిసిన్, పల్మానాలజిస్టులు, పీడియాట్రిస్టులు చాలా మంది ఉన్నారు. హెచ్‌ఎంపీవీ కేసులు వచ్చినా.. లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తాం. ఇప్పటికైతే కేసుల తీవ్రత ఎక్కువగా లేదుగానీ.. ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వైర్‌సకు ఎక్కువ మందికి సోకే గుణం ఉంది. కొంత మందికి సోకినా లక్షణాలు బయటపడకపోవచ్చు. వైరస్ వ్యాప్తి, తీవ్రత ప్రజలపైనే ఆధారపడి ఉంటుంది. అజాగ్రత్తగా ఉండొద్దు. వీలైనంతవరకూ రద్దీ ప్రాంతాల్లో తిరగకుండా ఉండడం మంచిది.
ఈ వైరస్ సోకితే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుందా?
హెచ్‌ఎంపీవీ సోకితేఔట్‌పేషెంట్లుగానే చికిత్స చేయవచ్చు. బాధితులు ఎవరి ఇంటిలో వారు విడిగా ఉంటే (ఐసోలేషన్) సరిపోతుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ రావు. జలుబు, దగ్గు ఉంటుంది కాబట్టి ఇతరులకు కాస్త దూరంగా ఉండాలి. మాస్కులు ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచడం, ఎవరి వస్తువులు, దుస్తులు వారే వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత జబ్బుల వంటివి ఉన్నవారికి వైరస్ సోకితే.. వారిని మాత్రం ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేస్తాం.
వైద్యాధికారులు ఆదేశిస్తే ప్రత్యేక వార్డు కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్
హెచ్‌ఎంపీవీ బాధితులకు చికిత్స అందించడానికి తమ వద్ద అన్ని వసతులూ ఉన్నాయని కింగ్‌కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వైద్యాధికారుల నుంచి ఆదేశాలు, మార్గదర్శక నియమాలు వచ్చిన వెంటనే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొవిడ్ సమయంలో తాము చాలా మందికి చికిత్సలు అందించామని, ఇక్కడే నమునాలు సేకరించి పరీక్షలు చేసి నిర్దారించామని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా హెచ్‌ఎంపీవీ నిర్ధారణ పరీక్షలూ తమవద్ద చేస్తామని ఆయన వెల్లడించారు.
Updated Date - Jan 09 , 2025 | 03:48 AM