Begumpet: నాడు అధ్వానంగా.. నేడు ఉద్యానవనంలా
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:35 AM
దశాబ్దాలుగా సరైన వసతులు లేక సమస్యలకు నిలయంగా మారిన బేగంపేట(Begumpet)లోని దనియాలగుట్ట హిందూ శ్మశానవాటిక ప్రస్తుతం అన్ని హంగులతో ఉద్యానవనంలా మారింది.

- సకల సౌకర్యాలతో దనియాలగుట్ట హిందూ శ్మశానవాటిక అభివృద్ధి
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవతో ఆధునిక హంగులు
హైదరాబాద్: దశాబ్దాలుగా సరైన వసతులు లేక సమస్యలకు నిలయంగా మారిన బేగంపేట(Begumpet)లోని దనియాలగుట్ట హిందూ శ్మశానవాటిక ప్రస్తుతం అన్ని హంగులతో ఉద్యానవనంలా మారింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని స్థానికులు చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Madapur: 17వ అంతస్తుపై నుంచి పడి కార్మికుడి మృతి
రూ.8 కోట్ల నిధులతో అభివృద్ధి..
బేగంపేట అభివృద్ధి చెందుతున్న సమయంలో అప్పటి పెద్దలు దనియాలగుట్ట శివారులో ఉన్న కొంత స్థలాన్ని శ్మశాన వాటికగా వాడుకోవాలని భావించారు. అప్పటికే పెద్ద బండరాళ్లు, ముళ్ల పొదలతో నిండి ఉన్న ఈ స్థలాన్ని పలుమార్లు చదును చేసి వినియోగంలోకి తీసుకురావాలని బస్తీవాసులు భావించారు. అయితే కోర్టు కేసు ఉండటంతో న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో స్థానికులు తమ కుటుంబ సభ్యులు మృతిచెందినప్పుడు రాళ్ల మధ్యనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ వచ్చారు. శ్మశానవాటిక కావాలని పదే పదే అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.
విషయం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) దృష్టికి వెళ్లడంతో ఎలాగైనా శ్మశాన వాటికను మహాప్రస్థానం మాదిరి తీర్చిదిద్దాలని ఆయన భావించారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే శ్మశాన వాటిక అభివృద్ధి కోసం రూ.8 కోట్ల నిధులు కేటాయించారు. క్రమంగా వసతులు ఏర్పాటు కావడం మొదలయ్యాయి. పచ్చటి చెట్లు, విద్యుత్ దీపాలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు మరుగు దొడ్లు, విశ్రాంతి గదులు, స్నానపు గదులు, అస్థికలను భద్రపరిచే గదులను నిర్మించారు. త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే కృష్ణారావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే పనులు
బస్తీ వాసులు 80 ఏళ్ల నుంచి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాను. నగరం నడిబొడ్డున శ్మశాన వాటిక పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం ఏంటని ఆయన విస్తుపోయారు. వెంటనే నిధులు కేటాయించారు. న్యాయ పరమైన చిక్కులు ఎదురైతే జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని స్థానికులు పట్టుదలతో ఉన్నారు. మొత్తానికి అందరి సహకారంతో స్మశాన వాటికను అభివృద్ధి చేసి అన్ని వసతులు సమకూర్చాం. మరికొన్ని నిధుల కోసం త్వరలోనే ప్రతిపాదనలు చేస్తాం. శ్మశానవాటికను అధికారికంగా ప్రారంభించకపోయినప్పటికీ స్థానికులకు వినియోగించుకుంటున్నారు.
- మాధవరం కృష్ణారావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ధి
కార్పొరేటర్‌గా అనేక పర్యాయాలు పనిచేశాను. అప్పట్లో ఈ శ్మశాన వాటికలో బోరు వేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారం తో స్మశాన వాటికకు స్థలం కేటాయించడంతో పాటు రూ.8 కోట్ల నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించాం.
- టి.మహేశ్వరి, బేగంపేట కార్పొరేటర్
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News