Share News

Asaduddin Owaisi: ఎందరు జైలుకెళ్తారో!

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:21 AM

‘రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు. వెళ్లాలి కూడా. ఇందులో ద్వందార్థం లేదు. నేనూ చంద్రబాబు హయాం(1998)లో 50 రోజులు జైలులో ఉన్నా. ప్రతి రాజకీయ నేత ఏదో సందర్భంలో జైలుకు వెళ్తాడు.

Asaduddin Owaisi: ఎందరు జైలుకెళ్తారో!

  • ప్రతి నేత జైలుకు వెళ్తారు.. వెళ్లాలి

  • వెళ్లినప్పుడే వారికి కష్టాలు తెలుస్తాయి

  • జైల్లో తనకు వండి పెట్టిన వ్యక్తిని సీఎం రేవంత్‌ ఇప్పటికీ మర్చిపోలేదు

  • నేనూ 50 రోజులు జైలులో ఉన్నా

  • మెట్రో కోసం పాతబస్తీ ఎదురుచూపులు

  • గత సీఎంలు దీన్ని పట్టించుకోలేదు

  • రేవంత్‌ మాత్రమే హామీని నెరవేర్చారు

  • కాంగ్రెస్‌ సర్కార్‌ను పాతబస్తీ గుండెల్లో పెట్టుకుంటుంది: అసదుద్దీన్‌ ఒవైసీ

మదీన/హైదరాబాద్‌ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు. వెళ్లాలి కూడా. ఇందులో ద్వందార్థం లేదు. నేనూ చంద్రబాబు హయాం(1998)లో 50 రోజులు జైలులో ఉన్నా. ప్రతి రాజకీయ నేత ఏదో సందర్భంలో జైలుకు వెళ్తాడు. వెళ్లినప్పుడే కష్టాలు తెలుస్తాయి. ఇంకా ఎంత మంది వెళ్తారో తెలియదు’ అని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ఎవరినీ మర్చిపోయే వ్యక్తి కాదని, జైలులో తనకు వండి పెట్టిన వ్యక్తితో ఫొటో తీసుకున్న విషయాన్ని ఇటీవల ఒక మీడియా ప్రతినిధి తనతో చెప్పారని పేర్కొన్నారు. జైలులో వెంట ఉన్న వ్యక్తినే రేవంత్‌ మరవలేదని, రాజకీయ నేతలు అలాగే ఉండాలని వ్యాఖ్యానించారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో కారిడార్‌ నిర్మాణంలో ఆస్తులను కోల్పోతున్న నిర్వాసితులకు సోమవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో చెక్కుల పంపిణీ, జూపార్కు-ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అసదుద్దీన్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో రైలు కోసం పాతబస్తీవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు మెట్రో ఏర్పాటుకు ప్రణాళికా వేసినా కుదరలేదని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడూ ఆలస్యమైందని గుర్తు చేశారు. ఆ తర్వాత సీఎంలుగా చేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను అడిగినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్‌ను కోరినా ఫలితం దక్కలేదని చెప్పారు. ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రమే పాతబస్తీకి మెట్రో ఆవశ్యకతను గుర్తించారని వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఫలక్‌నుమాలో ఓల్డ్‌సిటీ మెట్రో పనులకు శంకుస్థాపన చేశారని, దీన్ని పూర్తి చేస్తే పాతబస్తీ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసినా.. విడుదల కాలేదని గుర్తు చేశారు.


జంక్షన్‌గా చాంద్రాయణగుట్ట:ఎన్వీఎస్‌ రెడ్డి

మొదటి దశలోని అమీర్‌పేట్‌, జేబీఎస్‌ ఇంటర్‌చేంజ్‌ స్టేషన్ల మాదిరిగా చాంద్రాయణగుట్ట స్టేషన్‌ను జంక్షన్‌గా తీర్చిదిద్దుతామని హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో మెట్రో రైల్‌ కారిడార్‌ కోసం భూములను ఇచ్చేందుకు చాలామంది స్వచ్ఛందంగా వస్తున్నారని, గజానికి రూ.81వేల పరిహారం చెల్లిస్తున్నామని వెల్లడించారు. రూ.2,741 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్నామని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, నిర్మాణ ఖర్చులన్నీ కలుపుకొని ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు పరిహారం అందుతుందన్నారు. మెట్రో కారిడార్‌లో ఆస్తులు కోల్పోతున్న 1100 మందిలో ఇప్పటివరకు 169 మంది సమ్మతి పత్రాలు అందజేయగా.. తొలివిడతగా 41 మందికి రూ.20 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.

Updated Date - Jan 07 , 2025 | 04:21 AM