Share News

Asaduddin Owaisi: నేడు సుప్రీంలో విచారణకు ఒవైసీ పిటిషన్‌!

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:30 AM

ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991 అమలు కోరుతూ మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం విచారణకు రానుంది.

Asaduddin Owaisi: నేడు సుప్రీంలో విచారణకు ఒవైసీ పిటిషన్‌!

  • ప్రార్థనా స్థలాల చట్టం అమలు కోరుతూ వ్యాజ్యం

న్యూఢిల్లీ : ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991 అమలు కోరుతూ మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం విచారణకు రానుంది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని ఒవైసీ తన పిటిషన్‌లో కోరారు. హిందూ పక్షం వ్యాజ్యాలపై పలు మసీదుల సర్వేకు కోర్టులు ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ అంశంలో విచారణ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో ఒవైసీ వ్యాజ్యాన్ని కూడా కలిపే అవకాశం ఉంది. 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీల్లేకుండా 1991లో అప్పటి కాంగ్రెస్‌ సర్కారు ఈ చట్టాన్ని రూపొందించింది.


ఒవైసీ గత నెల 17న తన న్యాయవాది ద్వారా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దానికి కాస్త ముందు గత నెల 12న.. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ దేశంలోని ఏ కోర్టూ.. ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను విచారణకు స్వీకరించరాదని, ఇప్పటికే ఉన్న కేసుల్లో సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు, తుది ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చట్టంలోని పలు నిబంధనలను సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాశీలో జ్ఞానవాపి, మథురలో షాహీ ఈద్గాహ్‌ మసీదు సహా దేశవ్యాప్తంగా 10 మసీదులు/ముస్లిం ప్రార్థనా మందిరాల్లో సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన 18 వ్యాజ్యాల్లో తదుపరి విచారణలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఈ మసీదుల స్థానంలో దేవాలయాలు ఉండేవని, దురాక్రమణదారులు వాటిని కూల్చేశారన్నది హిందూ పక్షానికి చెందిన కక్షిదారుల వాదన.

Updated Date - Jan 02 , 2025 | 04:30 AM