Share News

Khammam: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:35 AM

తమ కూతురిని కడసారి చూసేందుకు వారు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామానికొచ్చారు.

Khammam: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

  • బాజీ మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు

  • అతడిని పెళ్లి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంది

  • మౌనిక తల్లిదండ్రులు.. మృతదేహం వద్ద కన్నీరు

మధిర రూరల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మౌనిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు! ఓ మోసగాడి మాటలను నమ్మి, పెళ్లి చేసుకొని, జీవితాన్నే నాశనం చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురిని కడసారి చూసేందుకు వారు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామానికొచ్చారు. తన భర్త దొంగ అని తెలియడం, వివిధ చోరీలకు సంబంధించి పోలీసులొచ్చి అతడిని తీసుకెళ్లడాన్ని తీవ్ర అవమానంగా భావించి గురువారం ఉదయం ఇంట్లోనే ఇద్దరు కూతుళ్లను చంపి, మౌనిక ఉరివేసుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం అర్ధరాత్రి తర్వాత మృతదేహాలను నిదానపురానికి తీసుకొచ్చారు. బాజీ మాయమాటలు చెప్పి తమ కూతురు మౌనికను వలలో వేసుకున్నాడని తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. బాజీతో పెళ్లి వొద్దని అప్పట్లోనే చెప్పామని, అయినా తమ మాట వినకుండా బాజీని పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుందని కన్నీళ్లపర్యంతమయ్యారు. ఆడపిల్లలెవరూ ఇలా మోసగాళ్ల వలలో పడొద్దని.. విలువైన జీవితాన్ని కోల్పోవొద్దని, పెద్దల మాటలు వినాలని సూచించారు. ఈనెల 16న చివరిగా తమకు మౌనిక ఫోన్‌ చేసిందని మృతురాలి మేనత్త చెప్పింది. ‘మీ అమ్మానాన్న మీ చెల్లెనే ఎక్కువగా చూసుకుంటూ నిన్ను పట్టించుకోవడం లేదు.. వెళ్లి డబ్బులు తీసుకురా..’ అని తనను బాజీ బెదిరిస్తున్నట్లుగా ఫోన్లో ఆమె చెప్పిందని మౌనిక మేనత్త వెల్లడించారు. 2 గంటల పాటు గ్రామంలో ఉన్న మౌనిక తల్లిదండ్రులు, బంధువులు అనంతరం వెళ్లిపోయారు. బాజీని పోలీసులు గురువారమే జైలుకు తరలించారు.


ఎంటెక్‌ చదివిన మౌనిక

మౌనిక ఉన్నత విద్యావంతురాలు. ఎంటెక్‌ పూర్తి చేసింది. ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో నివాసముంటున్నారు. వారికి మౌనికతో పాటు మరో కూతురు ఉంది. ఆమె లండన్‌లో ఉంటోం ది. ఆరేళ్ల క్రితం మౌనికకు రైల్లో బాజీ పరిచయమయ్యాడు. తనకు ఆస్తిపాస్తులున్నాయని మౌనికకు మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. తల్లిదండ్రులు అభ్యంతర పెట్టినా మౌనిక అతడిని మతాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు మెహక్‌(5), మెనురూల్‌(4) ఉన్నారు. గత కొన్నేళ్లుగా బాజీ జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 05:35 AM