Share News

Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:32 AM

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు.

Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు

కాంగ్రెస్‌ పాలిస్తున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడుతోంది. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని అటకెక్కించింది.

- ప్రధాని నరేంద్ర మోదీ

  • వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం, పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్‌ శైలి

  • కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోదీ ఆరోపణలు

  • ముస్లింలపై మీకంత ప్రేమ ఉంటే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని చేయండి

  • వక్ఫ్‌ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి

  • 2013 నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకే లాభమని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి, అడవులపై బుల్డోజర్లను నడిపిస్తోందని ఆరోపించారు. ప్రకృతికి నష్టం చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ సోమవారం హరియాణాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా యమునానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయింది. అదే సమయంలో అడవులపైకి బుల్డోజర్లను నడపడంలో బిజీగా ఉంది. పర్యావరణాన్ని దెబ్బతీయడం.. వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం.. అదే కాంగ్రెస్‌ పనితీరు. మేం చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడవులను నాశనం చేస్తోంది..’’ అని మోదీ వ్యాఖ్యానించారు.


ప్రజలకు కాంగ్రెస్‌ విశ్వాసఘాతుకం

కాంగ్రెస్‌ పాలిస్తున్న కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని అటకెక్కించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలోని కర్ణాటకలో విద్యుత్‌ నుంచి పాల దాకా, బస్సు చార్జీల నుంచి విత్తనాలకు దాకా ప్రతిదాని ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కర్ణాటకను దేశంలోనే నంబర్‌ వన్‌ చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల ముందు రెండు మోడళ్లు ఉన్నాయని మోదీ చెప్పారు. అందులో కాంగ్రెస్‌ మోడల్‌ పూర్తిగా అబద్ధమని నిరూపితమైందని, ఆ పార్టీలో కుర్చీ గురించి మాత్రమే ఆలోచిస్తారని పేర్కొన్నారు. రెండో మోడల్‌ సత్యం ఆధారంగా బీజేపీ చేస్తున్న పరిపాలన అని మోదీ చెప్పారు. అంబేడ్కర్‌ ఆలోచనల దిశలో బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు.


ముస్లింలపై అంత ప్రేముంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చేయాలి

తమ కొత్త వక్ఫ్‌ చట్టంపై కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తోందని.. యూపీఏ హయాంలో 2013లో తెచ్చిన చట్టం భూమాఫియాకు మాత్రమే పనికొచ్చిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. తాము తెచ్చిన కొత్త చట్టం ముస్లింలలోని పేద, పస్మాండ కుటుంబాలకు న్యాయం చేస్తుందని, ఇది అసలైన సామాజిక న్యాయమని చెప్పారు. ముస్లిం యువత ఇంకా టైర్లకు పంచర్లు వేసుకుంటూ బతకాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. ముస్లింల విషయంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముస్లింలపై అంత ప్రేమే ఉంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ముస్లింను ఎన్నుకోవాలని.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 50 శాతం ఎంపీ టికెట్లను ముస్లింలకు ఇవ్వాలని సవాల్‌ చేశారు. ఒక్క ముస్లింలు అని మాత్రమేకాదు, కాంగ్రెస్‌ ఎవరికీ కూడా మంచి చేయాలని చూడదని, అది కాంగ్రెస్‌ నైజమని మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి, అంబేడ్కర్‌ ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 05:32 AM