Share News

Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:15 AM

కర్ణాటక బీదర్‌లో, హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లో కాల్పులతో కలకలం సృష్టించిన దోపిడీ దొంగల కోసం హైదరాబాద్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

  • హైదరాబాద్‌ కాల్పుల ఘటనలోనిందితుల వేటకు 10 బృందాలు

  • చోరీ బిహారీ అమిత్‌ గ్యాంగ్‌ పనే!

  • బస్సులో అతడి పేరిటే టికెట్‌

  • కాల్పుల తర్వాత సికింద్రాబాద్‌కు

హైదరాబాద్‌ సిటీ/అఫ్జల్‌గంజ్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక బీదర్‌లో, హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లో కాల్పులతో కలకలం సృష్టించిన దోపిడీ దొంగల కోసం హైదరాబాద్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ బాలస్వామి, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుదీంద్ర ఆధ్వర్యలో 10 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. బీదర్‌లో వివిధ ఏటీఎంలలో నింపాల్సిన రూ.93 లక్షలను పథకం ప్రకారం కొట్టేసిన దొంగలు, అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపి, పరారయ్యారు. డబ్బును బ్యాగుల్లో సర్థుకొని హైదరాబాద్‌ మీదుగా రాయ్‌పూర్‌ వెళ్లేందుకు పథకం వేసిన దొంగలు అఫ్జల్‌గంజ్‌లో రోషన్‌ ట్రావెల్స్‌ బస్సును ఎక్కడానికి ప్రయత్నించారు. బస్సెక్కుతుండగా లగేజీని చెక్‌ చేసుకోవాలని జహంగీర్‌ (40) అనే బస్సు క్లీనర్‌ చెప్పగా ఆగ్రహించిన దొంగలు తమ వద్ద తుపాకీతో అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బీదర్‌లో జరిపిన కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. మరో సెక్యూరిటీ గార్డు తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య ఉన్నాడు.


అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల అనంతరం దుండగలు.. అక్కడి స్వీకార్‌ హోటల్‌ వద్ద ఆటో ఎక్కి, సిద్దంబర్‌ బజార్‌, ఎంజే మార్కెట్‌, ట్యాంక్‌బండ్‌ మీదుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌వైపు పారిపోయినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. రాత్రి 8 గంటలకు రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో దొంగలు తిరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు ఎక్కడ దిగారు? ఆటోలో ఏం మాట్లాడుకున్నారు? అనే విషయాలు తెలిసినట్లు సమాచారం. అయితే ఆ వివరాలేవీ పోలీసులు వెల్లడించ లేదు. రాత్రి 8 గంటల తర్వాత సికింద్రాబాద్‌ నుంచి చత్తీ్‌సగడ్‌ వెళ్లిన రైళ్లపై దృష్టి సారించిన పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకోవడానికి, వారి జాడ తెలుసుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫొటోలతో రైల్వే పోలీసుల సహకారం కూడా తీసుకున్నట్లు తెలిసింది. దొంగలు రాత్రికి రాత్రే రైల్లోగానీ, రోడ్డు మార్గం ద్వారా గానీ.. నగరం విడిచి వెళ్లారా? లేక నగరంలోనే ఎక్కడైనా ఆశ్రయం పొంది నక్కి ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, వసతి గృహాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే తెలియజేయాలని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, వసతి గృహాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


నిందితుడిపై 10 మర్డర్‌ కేసులు

బీదర్‌, హైదరాబాద్‌ పోలీసులకు దొరికిన ప్రాథమిక ఆధారాల ప్రకారం.. దుండగులు బిహార్‌కు చెందిన అమిత్‌ కుమార్‌ ముఠాగా నిర్ధారించినట్లు తెలిసింది. రోషన్‌ ట్రావెల్స్‌ బస్సులో అమిత్‌కుమార్‌ పేరుతో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ మాత్రం అతడిది కాదని తెలిసింది. ఆ ఫోన్‌ నంబర్‌ వివరాలు సేకరించగా నిందితులు బిహార్‌కు చెందిన ముఠాగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా అమిత్‌ కుమార్‌ గ్యాంగ్‌పై బిహార్‌లో ఇప్పటికే 10 హత్య కేసులు ఉన్నట్లు బిహార్‌ పోలీసులు హైదరాబాద్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.


కోలుకుంటున్న జహంగీర్‌

బిహార్‌ గ్యాంగ్‌ కాల్పుల ఘటనలో గాయపడిన జహంగీర్‌ (40) శాలిబండలోని అస్రా ఆస్పత్రిలోని అత్యవసరం విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతడికి పొత్తి కడుపు, ఎడమ కాలు తొడ భాగంలో తూటాలు దూసుకెళ్లాయి. వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. జహంగీర్‌ కోలుకుంటున్నాడని అక్కడి వైద్యులు తెలిపారు. కాల్పుల విషయం తెలియడంతో జహంగీర్‌ భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఆస్పత్రికి వచ్చి.. అతడిని చూసి భోరున విలపించారు. అతడి ప్రాణాలను కాపాడాలంటూ వారు వైద్యులను వేడుకోవడం అక్కడున్నవారిని కలిచివేసింది. కాగా బస్సు ఎక్కే సమయంలో బ్యాగులను తనిఖీ నిందితుల్లో ఒకరు జహంగీర్‌కు రూ.50వేలు ఇస్తామని ఆశ చూపించినట్లు తెలిసింది. ఆ డబ్బును అతడు తీసుకోకుండా తనిఖీకి పట్టుబట్టడంతోనే కాల్పులు జరిపినట్లు సమాచారం.

Updated Date - Jan 18 , 2025 | 05:15 AM