Share News

Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:04 AM

సంబురాల సంక్రాంతి కోసం పట్నం జనాలు కదిలారు పల్లెల వైపు! పుట్టి పెరిగిన ఊళ్లో తల్లిదండ్రులు, బంధువుల మధ్య జరుపుకొంటేనే అసలైన పండగ.. సిసలైన పండగ అంటూ పిల్లాజెల్లాతో కలిసి ఉత్సాహంగా బయలుదేరారు! ఫలితంగా దారులన్నీ హైదరాబాద్‌ శివార్లవైపు సాగుతున్నాయి.

Travel Rush: పట్నం బైలెల్లినాదో!

  • హైదరాబాద్‌ నగరం నుంచి పల్లెలకు చలో

  • సంక్రాంతికి పిల్లాజెల్లాతో కదిలిన జనం

  • శివారు రోడ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో రద్దీ

  • 6432 ప్రత్యేక బస్సులు.. 366 ప్రత్యేక రైళ్లు

  • బస్సుల్లో 50ు అధిక చార్జీ.. ప్రజల గగ్గోలు

  • ట్రావెల్స్‌ ఎక్కువ వసూలు చేస్తే.. బస్సు సీజ్‌

  • 3 రెట్లు పెరిగిన విమాన టిక్కెట్ల ధరలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): సంబురాల సంక్రాంతి కోసం పట్నం జనాలు కదిలారు పల్లెల వైపు! పుట్టి పెరిగిన ఊళ్లో తల్లిదండ్రులు, బంధువుల మధ్య జరుపుకొంటేనే అసలైన పండగ.. సిసలైన పండగ అంటూ పిల్లాజెల్లాతో కలిసి ఉత్సాహంగా బయలుదేరారు! ఫలితంగా దారులన్నీ హైదరాబాద్‌ శివార్లవైపు సాగుతున్నాయి. ప్రైవేటు వాహనాల వరుసతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి! బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ జనమే జనం! బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. శుక్రవారం మొదలైన ఈ సందడి.. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరగనుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేకంగా 6,432 బస్సులను నడపనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరంఘర్‌, బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


శనివారం తెలంగాణలోని జిల్లాలకు 1600, ఏపీవైపు 300 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక వేశారు. అయితే ఈ స్పెషల్‌ బస్సుల్లో అదనంగా 50శాతం చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకొని ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులను పొన్నం హెచ్చరించారు. ఎక్కువ చార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐదు ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్‌ చేయడం గమనార్హం. ఇక సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్‌ నుంచి ఏపీలోని నర్సాపూర్‌, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. 11, 12 తేదీల్లో చర్లపల్లి- విశాఖపట్నం-చర్లపల్లి వరకు సాదారణ కోచ్‌లతో 16 జన సాధారణ రైళ్లు నడుస్తున్నట్టు పేర్కొన్నారు.


అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌ల్లో వెళ్లే ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ యాప్‌లో యూటీఎస్‌ ద్వారా టిక్కెట్ల్‌ పొందడానికి అవకాశం ఉందని వెల్లడించారు.. అన్‌రిజర్వ్‌ కోచ్‌లతో ప్రత్యేక రైళ్లు నర్సాపూర్‌, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బైరంపూర్‌, జైపూర్‌, గోరఖ్‌పూర్‌, కటక్‌, మధురై, అర్సికెరె తదితర ప్రాంతాలకు నడుస్తున్నట్టు తెలిపారు. అలాగే జోన్‌ నుంచి నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వరంగల్‌ తదితర స్టేషన్‌ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నట్టు వివరించారు. చెన్నై, బెంగళూరు, మధురై జోన్‌ల నుంచి వచ్చే షాలిమార్‌, సంబల్పూర్‌, బరౌని, విశాఖపట్నం తదితర స్టేషన్‌లకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయన్నారు. పండుగ నేపథ్యంలో విమాన చార్జీలు మూడు రెట్లు పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖకు శని, ఆదివారాల్లో గరిష్ఠంగా రూ.17 నుంచి రూ. 18వేల మధ్య టిక్కెట్‌ ధరలు ఉన్నాయి.


హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఆదివారం టిక్కెట్‌ ధర రూ. 16,976లు ఉండగా రాజమండ్రికి అదే రోజు టిక్కెట్‌ ధర రూ. 15,086లు ఉంది. ప్రతి గంటకు టిక్కెట్‌ ధరలు మారుతున్నాయి. బెంగుళూరు నుంచి విశాఖపట్నానికి టిక్కెట్‌ ధర రూ. 17,391 ఉండగా బెంగుళూరు నుంచి రాజమండ్రికి టిక్కెట్‌ ధర 16,357గా ఉంది. కాగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల రద్దీ నెలకొంది. టోల్‌గేటు వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లకు 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలను పంపించారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా శుక్రవారం పండుగ నేపథ్యంలో 8000 వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్లు సిబ్బంది తెలిపారు. నల్లగొండ జిల్లా కొర్లపహాడ్‌, టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.


ఏపీవైపు ప్రత్యేక హైటెక్‌ వోల్వో బస్సులు

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేకంగా హైటెక్‌, వోల్వో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్ధ (టీజీటీడీసీ) అధికారులు తెలిపారు. ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ బస్సులు సికింద్రాబాద్‌ యాత్రినివాస్‌, బషీర్‌బాగ్‌ సీఆర్‌వో, ఎల్‌బీనగర్‌ నుంచి బయలుదేరుతాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 9848540371, 9848125720లో సంప్రదించాలని, వెబ్‌సైట్‌ (ఠీఠీఠీ.్టజ్టఛీఛి.జీుఽ) ద్వారా సీట్లు బుకింగ్‌ చేసుకోవచ్చునని చెప్పారు.

Updated Date - Jan 11 , 2025 | 04:04 AM