మనసులు నచ్చితే కాదు.. జన్యువులు నప్పితేనే పెళ్లి, పిల్లలు!
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:56 AM
పెళ్లి చేయాలంటే అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతారు! అదే సింగపూర్‌లో అయితే.. అమ్మాయి, అబ్బాయి జన్యువుల స్ర్కీనింగ్ చేస్తారు. ఇద్దరికీ పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆ పరీక్షలో తేలితేనే సంబంధం విషయంలో ముందుకెళ్తారు.

సింగపూర్‌లో జంటలకు ఉచిత జెనెటిక్ స్ర్కీనింగ్ ప్రోగ్రామ్
పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తేలాకే ముందుకు
‘బయో ఏషియా’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రజంటేషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పెళ్లి చేయాలంటే అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతారు! అదే సింగపూర్‌లో అయితే.. అమ్మాయి, అబ్బాయి జన్యువుల స్ర్కీనింగ్ చేస్తారు. ఇద్దరికీ పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆ పరీక్షలో తేలితేనే సంబంధం విషయంలో ముందుకెళ్తారు. లేదా ఏవైనా జన్యు సమస్యలు వచ్చేప్రమాదం ఉందని తేలితే.. మరో సంబంధం చూసుకుంటారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. సింగపూర్‌లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఈ జెనెటిక్ స్ర్కీనింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ)ది కీలక పాత్ర. వైద్య రంగంలో ఏఐ టెక్నాలజీతో తమ దేశం సాధిస్తున్న విజయాల గురించి, ఈ స్ర్కీనింగ్ గురించి.. జీనోమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ ట్యాన్ బయో ఏషియా సదస్సులో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వివాహం అయ్యాక, గర్భం దాల్చేందుకు సిద్ధమవుతున్న దంపతులు సైతం ఈ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని ఆయన వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వ ఆద్వర్యంలో చేపడుతున్న జెనెటిక్ స్ర్కీనింగ్ ప్రోగ్రాంతో ఇప్పటివరకు 39వేల మంది లబ్ధి పొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇదేకాదు.. సింగపూర్‌లో ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలనూ ఆన్‌లైన్లో ఉంచాలన్న లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం 2011లో నేషనల్ ఎలకా్ట్రనిక్ హెల్త్ రికార్డ్ (ఎన్‌ఈహెచ్‌ఆర్) ప్రాజెక్ట్ ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతోపాటు చిన్నపాటి క్లినిక్‌కు వెళ్లినా.. పౌరుల ప్రతీ రికార్డు ఆన్‌లైన్లో నమోదుచేస్తారు. ప్రతి పౌరుడి వైద్య చరిత్రతోపాటు జన్యుపరంగా అతడి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యాధుల వివరాలు, గత రోగాలు, శస్త్రచికిత్సలు, అనారోగ్య సమస్యలన్నీ ముందుగానే ప్రభుత్వం సేకరించింది. ఈ వివరాలను ఆసుపత్రులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటాయి. పౌరుడు చిన్నపాటి అనారోగ్య సమస్యతో చిన్నపాటి క్లినిక్‌కు వెళ్లినా.. వారి వివరాలన్నీ ఆన్‌లైన్లో చేరిపోతాయి. దీంతో గత రోగాల ఆధారంగా భవిష్యత్తులో తలెత్తబోయే ప్రాణాంతక వ్యాధులనూ గుర్తించే వీలుంటుందని ప్యాట్రిక్ ట్యాన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో తమ దేశ జనాభాలో దాదాపు 50శాతం మంది పౌరులకు లబ్ధి కలిగిందని.. తల్లిదండ్రుల రోగ చరిత్రను విశ్లేషించి, పిల్లలకు సంక్రమించే అవకాశాలున్న వ్యాధులను ముందస్తుంగా గుర్తించి, చికిత్స తీసుకునే అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు.