Share News

Sridhar Babu: అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ విషం

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:40 AM

రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు విషం కక్కుతున్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు.

Sridhar Babu: అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ విషం

  • కాళేశ్వరం కోసం 8 వేల ఎకరాల అడవిని తొలగించారు

  • నాడు పర్యావరణం గుర్తు రాలేదా?: దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు విషం కక్కుతున్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని మా ప్రభుత్వం కాపాడింది. కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింద’ని ఐటీ, పరిశ్రమల శాఖ శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింకపిల్ల హెచ్‌సీయూలో చనిపోయినట్లు, హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో చిత్రీకరించి, ప్రచారం చేశారని బీఆర్‌ఎ్‌సపై మండిపడ్డారు. ఏఐతో సృష్టించిన కంటెంట్‌తో పాటు అసలు ఫొటోలను ఆయన మీడియాకు విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి దూరదృష్టితో 400 ఎకరాలను అభివృద్ధి చేస్తానంటే బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోందన్నారు. రూ.5,200 కోట్ల భూమిని రూ.30 వేల కోట్ల విలువైనది చూపించారని కేటీఆర్‌ అంటున్నారని, ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం కంచ గచ్చిబౌలి భూములకు రూ.23 వేల కోట్ల విలువ వచ్చిందని తెలిపారు. రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌... దానికి ఆధారాలు ఎందుకు చూపడం లేదని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.


బీఆర్‌ఎస్‌ హయంలో సర్కారు భూములను తమకు నచ్చిన వారికి అప్పనంగా కట్టబెట్టారన్నారు. గత సర్కారు ఎన్నో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసిందని, అప్పుడు పర్యావరణ పరిరక్షణ గుర్తు రాలేదా అని నిలదీశారు. కాళేశ్వరం కోసం 8 వేల ఎకరాల అడవులను తొలగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ పరిధిలో జంట జలాశయాలకు నష్టం చేసేలా జీవో 111ను ఎత్తివేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. హరితహారం పేరిట రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టారని, మరి రాష్ట్రంలో పచ్చదనం ఎందుకు పెరగలేదన్నారు. 2016-19 మధ్య 12.12 లక్షల చెట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్లు కేంద్రమే లోక్‌సభలో వెల్లడించిన విషయం వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు. కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి సర్కారు అప్పు తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను శ్రీధర్‌బాబు ఖండించారు. ఆ భూములపై ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సచివాలయానికి వస్తే తప్పేంటని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌లో ఆమె ఎలాంటి సమీక్షలు చేయలేదని స్పష్టం చేశారు.


మహిళా పారిశ్రామిక పార్కులు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. గ్రామీణ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. శనివారం హైటెక్స్‌లో ప్రారంభమైన ‘ఫుడ్‌ ఏ ఫెయిర్‌’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైటెక్స్‌ ఎగ్జిబిషన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఆద్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహార ఉత్పత్తిదారులు, ఆహార శుద్ధి, ప్యాకేజింగ్‌ రంగ నిపుణులు, చెఫ్స్‌ తదితరులు పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తారని చెప్పారు. ఐటీ, ఫార్మా మాదిరిగానే వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమల రంగంలోనూ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలపడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఇప్పటికే రూ.16వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.


ఇవి కూడా చదవండి...

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 03:40 AM