Share News

Tummala: కేంద్ర పథకాలకు సీఎంల ఫొటోలు పెడతారా?

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:42 AM

రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని మాట్లాడుతున్న కొందరు.. ప్రజల సొమ్ముతో కేంద్రప్రభుత్వం నడుస్తున్నందున కేంద్ర పథకాల్లో సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు పెడతారా? అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ప్రశ్నించారు.

Tummala: కేంద్ర పథకాలకు సీఎంల ఫొటోలు పెడతారా?

సిరిసిల్లలో తుమ్మల సూటి ప్రశ్న.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు రాజ్యాంగ బాధ్యతలున్నాయని వ్యాఖ్య

  • తొలిసారి మోదీ హయాంలోనే వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ: పొన్నం

  • బీఆర్‌ఎ్‌సది ఏఐ విద్య : దుద్దిళ్ల

సిరిసిల్ల, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని మాట్లాడుతున్న కొందరు.. ప్రజల సొమ్ముతో కేంద్రప్రభుత్వం నడుస్తున్నందున కేంద్ర పథకాల్లో సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు పెడతారా? అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ప్రశ్నించారు. కేంద్రాన్ని పోషించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని, రాష్ట్రం చెల్లించే పన్నుల్లో కేవలం 30 పైసలే తెలంగాణకు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగ బద్ధంగా ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయని గుర్తు చేశారు. శుక్రవారం రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అపెరల్‌ పార్కులో రూ.62 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటుచేసిన ఫంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టెక్స్‌పోర్టు) గార్మెంట్‌ యూనిట్‌ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతన్నలు, నేతన్నల సంక్షేమమే ప్రాధాన్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి వర్కర్‌ టు ఓనర్‌ కార్యక్రమం పునరుద్ధరిస్తామన్నారు. బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి తమ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా అన్న సంగతి కేంద్రమంత్రి బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వస్త్ర పరిశ్రమపై పన్నుల్లేవని, కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తున్నదని, దాన్ని తొలగించాలన్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివేనని రికార్డుల్లో ఉన్నా కొందరు కృత్రిమ మేధను ఉపయోగించి నకిలీ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సది ‘ఏఐ’ విద్య అని పేర్కొంటూ.. ఆ పార్టీ నేత కేటీఆర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.


పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం:మంత్రులు

సిద్దిపేట కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధిపేట జిల్లా నంగనూరు నర్మెట్టలో రూ.300 కోట్లతో చేపట్టిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనులను శుక్రవారం వారు పరిశీలించారు. అనంతరం జిల్లాలో అకాల వర్షాలతో వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.


ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 03:42 AM