PG Medical Seats: పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Feb 11 , 2025 | 03:43 PM
PG Medical Seats: పీజీ మెడికల్ సీట్లలో స్థానికత చెల్లదంటూ త్రిసభ్య దర్మాసనం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తాము దాఖలు చేసిన పిటీషన్‌ను సైతం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే ముందు తాము విచారణ చేపడతామంటూ ఏప్రిల్ 4వ తేదీకి తదుపరి విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వాయిదా వేసింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ పిటీషన్‌పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దాంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే.. ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఆర్టికల్ 371(డి) అనుసరించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబిఎస్ చేసిన విద్యార్ధులకూ పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలంటూ దాదాపు 100 మంది జూనియర్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రల్లో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇక విభజన అనంతరం ఆర్టికల్ 371(డి) పదేళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలన్ననిబంధన ఉందన్న తెలంగాణ వాదనను తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు.
అదీకాక 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్ధులకు మాత్రమే స్థానికత కోటా వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రీజియన్‌లో మాత్రమే చదివిన వారికి ఈ స్థానికత వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం సైతం వాదించింది. ఇక ఆర్టికల్ 371(డి) ప్రకారం రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో సైతం ఎంబిబిఎస్ చదివిన వారు కూడా తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా కింద అర్హులేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆర్టికల్ 371(డి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వర్తిస్తున్నందు వల్ల అందులో సవరణలు చేసేంత వరకూ ఏపీ, రాయలసీమలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్ధులూ తెలంగాణలో స్థానిక కోటాకు అర్హులేనని స్థానిక హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో సుమారు 200 మంది విద్యార్ధులకు అడ్మిషన్లు లభించనున్నాయి. దీంతో హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇక పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునూ తెలంగాణకు వర్తింప జేయకూడదని రేవంత్ రెడ్డి సర్కార్‌ను కోరింది.
పీజీ మెడికల్ సీట్లలో స్థానికత చెల్లదంటూ త్రిసభ్య దర్మాసనం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తాము దాఖలు చేసిన పిటీషన్‌ను సైతం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే ముందు తాము విచారణ చేపడతామంటూ ఏప్రిల్ 4వ తేదీకి తదుపరి విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వాయిదా వేసింది.
For Telangana News And Telugu News