Supreme Court: బీసీ బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం!
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:08 AM
తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులపై రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నుంచి మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

గవర్నర్ పంపిన రెండు బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం
బిల్లులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం
ఆమోదించకపోతే కారణాలు చెప్పాలి
రాష్ట్రపతి న్యాయ సలహా కోరే చాన్స్
సుప్రీం తీర్పుతో బీసీలకు మేలు: పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులపై రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం) నుంచి మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు పంపే బిల్లులపై రాష్ట్రపతి గరిష్ఠంగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాకపోతే.. అందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పంపిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో సహకారం అందించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒకవేళ సదరు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రపతి భావిస్తే.. దానిని సుప్రీంకోర్టు న్యాయ సలహాకు కూడా పంపించవచ్చు. కాగా, ఈ తీర్పు ప్రభావం తెలంగాణ రాష్ట్ర బిల్లులపై కూడా ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులను గవర్నర్ ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి. బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం కలిపి మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటున్నాయి. కానీ, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులు సుదీర్ఘకాలంపాటు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంటాయని, వాటికి ఆమోదం లభిస్తుందా? లేదా? అనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ బీసీ బిల్లులపై ఏదో ఒక నిర్ణయం వెలువరించాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది.
రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకు!
బీసీ బిల్లులపై రాష్ట్రపతి ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే.. ఎందుకు ఆలస్యమవుతుందో కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా పంపించాలి. రాష్ట్రపతి పంపిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చి సహకరించాలి. రాష్ట్రపతి తన వద్ద ఉన్న బిల్లులను ఆమోదించడం, తిప్పిపంపడం, లేదంటే కొన్ని అంశాలపై లిఖితపూర్వకంగా వివరణ అడగడం, లేకుంటే రాజ్యాంగబద్ధత ఉందా? అని సుప్రీంకోర్టుకు లేఖ రాయడం.. వీటిలో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కానీ, ఇందులో ఏదీ చేయకపోతే.. తమ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి పెండింగ్‌లో పెట్టారంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఉన్నాయి. వీటిపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి ఎదుట పలు అవకాశాలున్నాయి. అందులో ఒకటి.. తెలంగాణ గవర్నర్ పంపిన బిల్లులను తిప్పి పంపవచ్చు. లేదా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ వంటి న్యాయకోవిదుల సలహా తీసుకోవచ్చు. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పవచ్చు.
3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే
రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది. రాష్ట్ర గవర్నర్ పంపిన బీసీ బిల్లులపై సైతం రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లు బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చినా.. న్యాయసమీక్షకు నిలబడతాయనే గ్యారెంటీ లేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్నా సరే వాటిపై న్యాయసమీక్ష చేయవచ్చునని ‘ఐఆర్, కొహెలో’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. అందుకే తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు 67శాతం అమలవుతాయని చెప్పలేం. తమిళనాడు 69 శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టినా సుప్రీంలో పిటిషన్‌లు దాఖలయ్యాయి. అవి పెండింగ్‌లో ఉన్నాయి.
- కె.రామకృష్ణారెడ్డి, మాజీ అడ్వకేట్ జనరల్
సుప్రీం తీర్పుతో బీసీలకు ఎంతో మేలు: పొన్నం
రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు, రాష్ట్రంలోని బీసీ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిర్ధిష్ట కాలపరిమితిలోపు గవర్నర్లు, రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి కూడా ఆమోదించాల్సిందేనని తెలిపారు.
రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరవచ్చు
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ పంపిన బీసీ బిల్లులపై ఏం చేయాలనే దానిపై రాష్ట్రపతి.. అటార్నీ జనరల్ అభిప్రాయం కోరవచ్చు. మరోవైపు రాజ్యాగంలోని ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి నేరుగా సుప్రీంకోర్టు సలహా కూడా కోరవచ్చు. ‘ఇందిరా సహానీ’ కేసులో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు నిర్దేశించింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే అవకాశం ఉంది.
- బి.శివానంద ప్రసాద్, మాజీ అడ్వకేట్ జనరల్
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News